రజినీ సార్.. పోస్టర్లు సరే.. మరి కంటెంట్?

రజినీ సార్.. పోస్టర్లు సరే.. మరి కంటెంట్?

నిన్న ఉదయం నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చడీచప్పుడు లేకుండా రజినీ కొత్త సినిమా ‘కాలా’ టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఈ చిత్ర నిర్మాత ధనుష్. టైటిల్ గోలో.. ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయంటూ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

ఐతే ఇంతకుముందు ‘కబాలి’ సినిమాకు కూడా ఇలాగే అదిరిపోయే పోస్టర్లు డిజైన్ చేశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి.. విడుదలకు ముందు రిలీజ్ చేసిన లుక్స్ వరకు ప్రతి ఒక్కటీ అదిరిపోయాయి. అప్పట్లో అవి చర్చనీయాంశమయ్యాయి. రజినీ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరినీ అవి ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచాయి.

ఐతే ముఖచిత్రం ఎంత గొప్పగా ఉంటే ఏంటి.. లోపల మేటర్ ఉంటేనే కదా ఏ పుస్తకమైనా ఆకట్టుకునేది? ‘కబాలి’ ఆ విషయంలో తీవ్ర నిరాశకు గురి చేసింది. సినిమాపై పెట్టుకున్న అంచనాల్ని రంజిత్ నిలబెట్టలేకపోయాడు. నీరసంగా సాగిన ‘కబాలి’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది.

పోస్టర్లవీ చూసి ఏదో ఊహించుకుంటే లోపల బొమ్మ మరోలా కనిపించింది. తమిళంలో ‘కబాలి’ ఓ మోస్తరుగా ఆడింది కానీ.. తెలుగులో మాత్రం సినిమా నిలబడలేదు. అందుకే ‘కాలా’ ఫస్ట్ లుక్ పోస్టర్లవీ చూసి మన జనాలు పెద్దగా ఎగ్జైట్ కావట్లేదు. ఈ పోస్టర్ల సంగతి సరే కానీ.. సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అంటూ తేలిగ్గా మాట్లాడుతున్నారు. ‘కబాలి’కి ఊగిపోయినట్లుగా.. ‘కాలా’ విషయంలో స్పందించట్లేదు. రంజిత్ ‘కబాలి’ తరహాలోనే ‘కాలా’ను తీర్చిదిద్దుతాడా.. ఈసారైనా అందరూ మెచ్చే సినిమా తీస్తాడా.. చూద్దాం మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు