రజినీ సార్.. మళ్లీ అలాగేనా?

రజినీ సార్.. మళ్లీ అలాగేనా?

రజినీకాంత్ అల్లుడు ధనుష్ సడెన్ గా పెద్ద షాకే ఇచ్చాడు. సూపర్ స్టార్ కొత్త సినిమా టైటిల్.. దాని లోగో రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచాడు. రోబో సీక్వెల్ ‘2.0’ తర్వాత రజినీ.. ‘కబాలి’ డైరెక్టర్ పా.రంజిత్ తో ఇంకో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకొన్ని రోజుల్లోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాకు ముందే టైటిల్ ప్రకటించారు. కాలా.. ఇదీ ఈ సినిమా టైటిల్.

కరికాలన్ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూ ఇదే టైటిల్ పెట్టారు. ఒకేసారి టైటిల్ లోగోలు రిలీజ్ చేశారు. ఈ లోగో అది చూస్తే జనాలకు మళ్లీ ‘కబాలి’ గుర్తుకు రావడం ఖాయం. ఎందుకంటే ‘కాలా’ కూడా ‘కబాలి’ తరహాలోనే అనిపిస్తోంది. పైగా టైటిల్ లోగోతో రజినీ ఫేస్ కట్ కూడా ‘కబాలి’ తరహాలోనే కనిపిస్తోంది.

రజినీ మరోసారి గడ్డంతో రియలిస్టిక్ లుక్ లో కనిపించబోతున్నాడన్న ఈ లోగో చూస్తే అర్థమవుతోంది. ‘కబాలి’ టైటిల్లో తమిళ వాసనలు కొడుతున్నాయని అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ తెలుగులో కూడా ఆ టైటిలే కొనసాగించారు. ఇప్పుడు ‘కాలా’ కూడా ఆ తరహాలోనే ఉంది. రెండు భాషలకూ ఓకే అనిపించే టైటిల్ కోసం ఎందుకు ట్రై చేయరో ఏంటో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

 ఇది మాఫియా డాన్ హాజీ మస్థాన్ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. ఐతే దాన్ని ధనుష్ ఖండించాడు. ఐతే ఇది ఒక మాఫియా డాన్ కథ అన్నది మాత్రం ఖాయం అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి కథానాయికగా నటించనుంది. ధనుష్ ఈ చిత్రాన్ని ‘వండర్ బార్ ఫిలిమ్స్’ బేనర్ మీద నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ చిత్రం పూర్తయ్యే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవికి విడుదల కావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు