'మగధీర'తో ఎలాంటి లింకు లేదు

'మగధీర'తో ఎలాంటి లింకు లేదు

'మగధీర' చిత్రాన్ని కాపీ కొట్టేసారని 'రాబ్తా' ట్రెయిలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తమ చిత్రాన్ని కాపీ కొట్టారు కనుక పరిహారం చెల్లించేవరకు విడుదల కానివ్వరాదని అల్లు అరవింద్‌ రాబ్తా నిర్మాతలపై కేస్‌ ఫైల్‌ చేసారు.

కోర్టు త్వరలోనే దీనిపై విచారణ జరపనుంది. ఇదిలావుంటే 'రాబ్తా' కథ ఒరిజినల్‌ అని, ఇది ఏ చిత్రానికి కాపీ కాదని రాబ్తా హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ నొక్కి వక్కాణించాడు. ట్రెయిలర్‌ చూసి సినిమా కథ ఏమిటో ఎలా ఊహిస్తారని, కొన్ని పోలికలు కనిపించినంత మాత్రాన కాపీ అయిపోతుందా అని అడుగుతున్నాడు. రాబ్తా ఇంతవరకు ఇండియన్‌ స్క్రీన్‌పై రాని ఒక చిత్రమైన కాన్సెప్ట్‌, బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిందని, కోర్టులో ఆ కేసు కొట్టి పారేస్తారని, రాబ్తా విడుదలకి ఎలాంటి ఆటంకం వుండదని అతను అన్నాడు. జూన్‌ 9న ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని 'ధోని' ఫేమ్‌ సుషాంత్‌ చెప్పాడు.

కమర్షియల్‌ హీరోగా తన స్టేటస్‌ పెంచే సినిమా అవుతుందని సుషాంత్‌ ఆశాభావం వ్యక్తం చేసాడు. మగధీర చిత్రాన్ని చాలా మంది బాలీవుడ్‌లో చేద్దామని చూసారు కానీ అది మెటీరియలైజ్‌ కాకపోవడంతో ఆ కాన్సెప్ట్‌ తీసుకుని రాబ్తా దర్శకుడు కొత్త బ్యాక్‌డ్రాప్‌ సెట్‌ చేసినట్టున్నాడు. మరి దీనిని కోర్టు కేవలం స్ఫూర్తిగా పరిగణిస్తుందో లేక కాపీ అని తేల్చేస్తుందో తెలియాలంటే ఒక వారం ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు