'బాహుబలి'ని చూసి వాత పెట్టుకుంటే అంతే..

'బాహుబలి'ని చూసి వాత పెట్టుకుంటే అంతే..

ఒక ప్రాంతీయ సినిమా అయిన 'బాహుబలి: ది కంక్లూజన్' ఏకంగా 1500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఇండియాలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు శ్రీకారం చుట్టుకుంటున్నాయి. ఓవైపు శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో రూ.400 కోట్ల బడ్జెట్లో 'రోబో' సీక్వెల్ '2.0' తెరకెక్కుతుంటే.. రూ.300 కోట్లకు పైగా ఖర్చుతో 'సంఘమిత్ర'ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మరోవైపు అల్లు అరవింద్ రూ.500 కోట్లతో 'రామాయాణం' ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూ.1000 కోట్లతో 'మహాభారతం' అంటున్నారు. ఐతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా 'బాహుబలి'ని చూసి సినిమాల బడ్జెట్లు పెంచేస్తే అసలుకే మోసం వస్తుందని.. కేవలం భారీ బడ్జెట్లతో సినిమాలు తీసినంత మాత్రాన సినిమాలు ఆడేయవని హెచ్చరిస్తున్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఇందుకు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.

''అప్పట్లో తెలుగులో భారీ బడ్జెట్లో 'రహస్యం' అనే సినిమా తీశారు. ఇండియాలో అప్పటిదాకా ఎవ్వరూ అంత బడ్జెట్‌తో సినిమా తీయలేదు. నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు.. ఇంకా చాలామంది ప్రముఖ నటీనటులు ఆ సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అస్సలు ఆడలేదు. ఆ తర్వాత ఒక శ్రీలంక బిజినెస్ మ్యాన్ ఇక్కడికొచ్చి 'ప్రపంచం' అనే సినిమా తీశాడు. ఇండియాలోని ప్రధాన భాషలతో పాటు మొత్తం 20కి పైగా భాషల్లో తెరకెక్కింది. అప్పట్లోనే దానికి నాలుగైదు కోట్లు ఖర్చు చేశారు.

కానీ అది ఒక్క రోజు కూడా ఆడలేదు. నాగార్జున హీరోగా 'రక్షకుడు' అనే సినిమాను కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. దానికి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. దీన్ని బట్టి తెలిసిందేమంటే.. కేవలం బడ్జెట్లు భారీగా ఉంటే సినిమాలు ఆడేయవు. రాజమౌళి అండ్ టీం లాగా ప్రాణం పెట్టి సినిమా తీయాలి. ప్యాషన్‌తో సినిమా చేయాలి. అప్పుడే 'బాహుబలి' లాంటి సినిమాలొస్తాయి. అంతేసి బడ్జెట్లు పెడితే మేం కూడా ఇలాంటి సినిమాలు తీసేస్తాం అని కొందరు పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. అది తప్పు. బడ్జెట్ ఉంటే గొప్ప సినిమాలు వచ్చేయవు. ప్యాషన్ ఉండాలి'' అని తమ్మారెడ్డి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English