బిగ్ బ్రేకింగ్‌: ఈట‌ల‌పై మ‌రో కేసు

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై సీఎం కేసీఆర్ మ‌రో అస్త్రం ప్ర‌యోగించారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న హ్యాచ‌రీస్ కోసం త‌మ అసైన్డ్ భూముల‌ను ఆక్ర‌మించుకున్నార‌న్న రైతుల ఫిర్యాదుపై వెంట‌నే స్పందించిన కేసీఆర్ అదికారుల‌ను పంపించి క్షేత్ర‌స్థాయిలో నివేదిక‌లు తెప్పించుకున్నారు. ఈలోగానే.. ఆయ‌న‌నుంచి ముందు వైద్య‌, ఆరోగ్య శాఖ‌ను లాగేసుకున్న కేసీఆర్‌.. 24 గంట‌ల్లో ఆయ‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామ‌మే రాష్ట్ర వ్యాప్తంగా భోగిమంట‌గా మండుతుంటే.. ఇప్పుడు మ‌రో అస్త్రం సంధించారు.

శామీర్ పేట‌లోని దేవ‌యాంజ‌ల్ భూముల‌ను ఆక్ర‌మించుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న క‌దిలింది. దీనిపై నిగ్గు తేల్చాలంటూ.. ఏకంగా న‌లుగురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌తో కూడిన క‌మిటీని వేసింది. దీనిలో సీనియ‌ర్ ఐఏఎస్‌లు.. ర‌ఘునంద‌న్‌రావు, ప్ర‌శాంత్ జీవ‌న్‌, భార‌తి హొలికెరి, శ్వేతా మ‌హంతి ఉన్నారు. ఈ భూములను ఆక్ర‌మించారంటూ.. మాజీ మంత్రి ఈటల స‌హా ప‌లువురిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని.. అందుకే తాము క‌మిటీ వేశామ‌ని.. తాజాగా కేసీఆర్ స‌ర్కారు ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని క‌మిటీని ప్ర‌భుత్వం ఆదేశించింది.

ఇక‌, ఈ భూముల విష‌యానికి వ‌స్తే.. 1992లో తాను ఈ భూములు కొన్న‌మాట వాస్త‌వ‌మేన‌ని ఈట‌ల చెప్పుకొచ్చారు. అయితే.. అప్ప‌ట్లో ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ని దేవాదాయ శాఖ‌.. ఇప్పుడు త‌న‌వే ఈ భూముల‌ని చెప్ప‌డం కుట్ర‌లో భాగ‌మేన‌ని ఆరోపించారు. తాను క‌ష్ట‌ప‌డి ఈ భూములు కొనుగోలు చేశాన‌ని చెప్పిన ఈట‌లప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరుపై అవ‌స‌ర‌మైతే.. న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా మొత్త‌గా చూస్తే.. ప్ర‌స్తుతం కేసీఆర్‌కు ఈట‌లకు మ‌ధ్య పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.