అరవ అతికి అంతే లేదా?

అరవ అతికి అంతే లేదా?

బాహుబలితో తెలుగు సినిమాకి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చేయడంతో, ఇప్పుడు అర్జంటుగా తమిళ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తమిళ చిత్ర సీమకి చెందిన వాళ్లు తెగ తాపత్రయ పడుతున్నారు. అసలు బాహుబలి అంతటి ఘన విజయాన్ని ఎందుకు అందుకుందో, దాని వెనుక ఎంత కష్టం వుందో అనేది ఏమాత్రం పట్టించుకోకుండా, 'మేము కూడా బాహుబలిని మించిన సినిమా తీయగలం' అంటూ బింకాలు పలుకుతున్నారు.

శృతిహాసన్‌తో సుందర్‌.సి తీసే 'సంఘమిత్ర' చిత్రాన్ని కేన్స్‌ చిత్రోత్సవంలో అనౌన్స్‌ చేయడాన్ని బట్టే ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించడానికి వాళ్లు పడుతోన్న తపన తెలుస్తోంది. బాహుబలిని మించిన సినిమా అని చెప్పుకుంటోన్న ఈ చిత్రాన్ని తమిళ హీరోలే పట్టించుకోపోవడం గమనార్హం.

విజయ్‌, సూర్య లాంటి హీరోల వెంట తిరిగి, వాళ్లు పట్టించుకోకపోయే సరికి ఆర్య, జయం రవితో తీసేస్తున్నారు. బాహుబలిని మించిన సినిమా అంటే తమిళ జనాలే నవ్వుతున్నా కానీ మన సినిమాతో పోల్చుకోవడం మానట్లేదు. 2.0 అంతటి భారీ బడ్జెట్‌ చిత్రం తీస్తూ కూడా బాహుబలి 2తో పోలిక పెట్టుకోని శంకర్‌ని చూసి అయినా సుందర్‌కి తెలియడం లేదా? ఇంతకుముందు ఇలాగే బాహుబలి తర్వాత పులి అంటూ ఒక చిత్రాన్ని జాతీయ వ్యాప్తంగా విడుదల చేసి అభాసు పాలయ్యారు.

దానితో పోల్చి చూడకండని చెప్పుకుంటే బెటర్‌ మార్కెటింగ్‌ అవుతుందేమో ఒకసారి సంఘమిత్ర మేకర్స్‌ ఆలోచించుకుంటే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు