లారెన్స్-విజయేంద్ర.. శతాబ్దాలు వెనక్కి

లారెన్స్-విజయేంద్ర.. శతాబ్దాలు వెనక్కి

‘బాహుబలి: ది కంక్లూజన్’తో మెగా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా తర్వాత ఆయనేమీ రిలాక్స్ కావట్లేదు. వేర్వేరు భాషల్లో తెరకెక్కబోయే భారీ సినిమాలకు కథలు అందిస్తున్నారు. తమిళంలో ఇప్పటికే ఆయన కథతో విజయ్ హీరోగా ఓ సినిమా మొదలైంది. మరోవైపు రాఘవ లారెన్స్ హీరోగా విజయేంద్ర కథతో తమిళ, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కబోతుండటం విశేషం. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్, రాజమౌళిల దగ్గర శిష్యరికం చేసిన మహదేవ్ (మిత్రుడు, జాగ్వార్ చిత్రాల దర్శకుడు) దర్శకత్వం వహించనున్నాడు.

పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రెండు కథలు ఉంటాయట. అందులో ఒక కథ 18వ శతాబ్దంలో జరిగితే.. మరో కథ 19వ శతాబ్దంలో నడుస్తుందట. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. లారెన్స్ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం విశేషం.

విజయేంద్ర ప్రసాద్ కథలో లారెన్స్ హీరోగా నటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఇటీవలే ‘శివలింగ’తో హిట్టు కొట్టిన లారెన్స్.. విజయేంద్ర సినిమాతో పాటు ఇంకో రెండు చిత్రాల్ని కూడా లైన్లో పెట్టాడు. అతడి స్వీయ దర్శకత్వంలో ‘కాంచన’ సిరీస్‌లో కొత్త సినిమా ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలవుతుంది. దీంతో పాటు తమిళంలో మరో సినిమా చేయబోతున్నాడు లారెన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు