నాగ్ తీర్పిచ్చేశాడు.. బ్లాక్‌బస్టర్ అని

నాగ్ తీర్పిచ్చేశాడు.. బ్లాక్‌బస్టర్ అని

తన నిర్మాణంలో వచ్చే సినిమాల గురించి మరీ ఎక్కువ చేసి చెప్పుకోడు అక్కినేని నాగార్జున. ఐతే తన కొడుకు నాగచైతన్య హీరోగా తాను నిర్మించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ గురించి మాత్రం నాగ్ కొంచెం ఎక్కువగానే చెబుతున్నాడు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని.. ఆ విషయం ముందే బల్లగుద్ది చెబుతున్నానని నాగ్ అన్నాడు. ‘రారండోయ్..’ ఆడియో వేడుకలో నాగ్ మాట్లాడుతూ.. తన ఇద్దరు కొడుకులకు రెండు బ్లాక్ బస్టర్లు ఇస్తానని పోయినేడాది మాట ఇచ్చానని.. ‘రారండోయ్’ సినిమాతో ఒక మాట నిలబెట్టుకోబోతున్నానని నాగ్ అన్నాడు.

‘‘నా సినిమాల్లో పడి నా కొడుకుల సంగతి పట్టించుకోలేదని.. వాళ్ల కెరీర్ మీద దృష్టి పెట్టి వాళ్లిద్దరికీ రెండు బ్లాక్ బస్టర్లు ఇస్తానని పోయినేడాది అభిమానులకు మాటిచ్చాను. ఇప్పుడు ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో సగం మాట నిలబెట్టుకుంటున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో సందేహం లేదు. మళ్లీ చెబుతున్నా.. వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. నాకు ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఎలాగో.. నాగచైతన్యకు ‘రారండోయ్..’ అలా అవుతుంది. అఖిల్‌కు కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తాను. విక్రమ్ అండ్ టీం అందుకోసం కష్టపడుతోంది. ఆ సినిమా విషయంలోనూ ఏమాత్రం రాజీ పడకుండా నిర్మిస్తున్నాను’’ అని నాగార్జున అన్నాడు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత మరోసారి తన ప్రతిభ చూపించాడని.. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచాడని నాగ్ అన్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు