మా సినిమా బాహుబలి ని మించిపోతుంది

మా సినిమా బాహుబలి ని మించిపోతుంది

‘బాహుబలి’ మొత్తం దేశంలోని అన్ని ఫిలిం ఇండస్ట్రీలకూ స్ఫూర్తిగా నిలిచింది. సరైన విజన్ ఉండాలే కానీ.. బాగా తీయాలే కానీ.. ఓ సినిమాను ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్లవచ్చో ‘బాహుబలి’ రుజువు చేసింది. ఈ స్ఫూర్తితో మిగతా ఇండస్ట్రీల్లో భారీ ప్రాజెక్టులు శ్రీకారం చుట్టుకుంటున్నాయి.

తమిళంలో సీనియర్ దర్శకుడు సుందర్.సి ‘బాహుబలి’ తరహాలోనే ‘సంఘమిత్ర’ పేరుతో ఓ జానపద చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఐతే ఇది ‘బాహుబలి’ స్థాయిని అందుకుంటుందా అని జనాల్లో సందేహాలు లేకపోలేదు. సుందర్ చెప్పిన బడ్జెట్.. మిగతా ముచ్చట్లు చూస్తుంటే ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో తయారవుతుందేమో అన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. కానీ సుందర్ మాత్రం ఇది ‘బాహుబలి’ని మించిపోతుందని అంటుండటం విశేషం.

బాహుబలి దక్షిణ భారత సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్తే.. తన దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘సంఘమిత్ర’ ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని సుందర్ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో రూపొందించడానికి సన్నాహాలు పూర్తయ్యాయని.. దీని కోసం తాను కొన్నేళ్లుగా కష్టపడుతున్నానని సుందర్ అన్నాడు. ఈ సినిమా తన కల అని.. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలా సమయం ఎదురు చూశానని చెప్పాడు.

భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి టెక్నికల్ టీం అవసరం కావడంతో ఇన్నేళ్లు ఆగాల్సి వచ్చిందని.. ఇప్పుడు అన్నీ సమకూరడంతో సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోందని సుందర్ ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ వేదిక నుంచి అన్నాడు. కేన్స్‌లోనే ‘సంఘమిత్ర’ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలోనే ‘సంఘమిత్ర’ రెగ్యులర్‌ షూటింగ్ ఆరంభమవుతుంది. 2018 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు