వెన్నెల కిషోర్ సైలెంటుగా చంపేశాడు

వెన్నెల కిషోర్ సైలెంటుగా చంపేశాడు

వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'వెన్నెల' దగ్గర్నుంచి అతను తాను నటించిన ప్రతి సినిమాతోనూ మెప్పిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కిషోర్ మరింతగా మెరుస్తున్నాడు. మంచి మంచి క్యారెక్టర్లు పడుతుండటంతో చెలరేగిపోతున్నాడు.

పోయినేడాది 'జెంటిల్‌మన్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాల్లో వెన్నెల కిషోర్ అదరగొట్టేశాడు. ఆ సినిమాలకు అతడి కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు కిషోర్ 'కేశవ'లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏజ్ బార్ అయిన కాలేజీ స్టూడెంట్ క్యారెక్టర్లో అతను పండించిన కామెడీ 'కేశవ'కు పెద్ద ప్లస్ అయింది.

పెద్దగా హడావుడి చేయకుండా సింపుల్‌గా కామెడీ పండించడం వెన్నెల కిషోర్ ప్రత్యేకత. 'కేశవ'లో ఆ తరహాలోనే నవ్వించాడు కిషోర్. అతడి కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుందో చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ. 'అతడు'లో పొలం ఫైట్ సీన్ రెఫరెన్స్‌తో పండించిన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు కిషోర్. ఇంకా కిషోర్ చెలరేగిపోయిన సీన్లు చాలానే ఉన్నాయి 'కేశవ'లో.

అతను తెరమీద కనిపించినపుడల్లా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. అంత బాగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. డైలాగులు కూడా చాలా ఫన్నీగా రాశారు. వాటిని కిషోర్ తన టైమింగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. బ్రహ్మానందం జోరు తగ్గిపోయాక.. మిగతా కమెడియన్లు అంతంతమాత్రంగా మారాక ప్రస్తుతం టాలీవుడ్లో వెన్నెల కిషోరే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. బోర్ కొట్టించని కామెడీతో నవ్విస్తూ సాగిపోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు