‘ఉయ్యాలవాడ’ కోసం అంతమందా?

‘ఉయ్యాలవాడ’ కోసం అంతమందా?

‘ఖైదీ నంబర్ 150’తో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సాఫీగా సాగిపోయింది. తన రీఎంట్రీకి రీమేక్‌ను ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడేశాడు చిరు. ఇక ఇప్పుడు చిరు అసలైన సవాల్‌కు సిద్ధమవుతున్నాడు.

స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయబోతున్నాడు. చిరంజీవి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడానికి ముందు చాలా ఏళ్ల పాటు కమర్షియల్ సినిమాలే చేశాడు. ఆయన ప్రయోగాలు మానేసి చాలా కాలమైంది.

90ల నుంచి మాస్ మసాలా సినిమాలకే పెద్ద పీట వేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చేస్తే జనాలు చూసే పరిస్థితి ఉండదు. అందుకే ట్రెండుకు తగ్గట్లుగా భిన్నమైన సినిమా చేయబోతున్నాడు. చిరు ఈ సినిమాతో మెప్పించడం కచ్చితంగా సవాలే.

ఐతే ‘ఉయ్యాలవాడ..’ను సెట్స్ మీదికి తీసుకెళ్లే ముందు పెద్ద ఎత్తునే కసరత్తు చేస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు దాదాపు అరడజను మంది రచయితలు ఈ స్క్రిప్టును తీర్చిదిద్దే పనిలో ఉండటం విశేషం. ఈ చిత్రానికి కథ అందించింది పరుచూరి సోదరులన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల కిందటే వాళ్లిద్దరూ డైలాగ్ వెర్షన్‌తో సహా స్క్రిప్టు రెడీ చేశారు. ఐతే పరుచూరి సోదరులు ఈ ట్రెండుకు తగ్గట్లు డైలాగులు రాయలేరని.. కేవలం కథ వరకు తీసుకుని ఈ తరం రచయితలకు పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ చేసే బాధ్యతలు అప్పగించారు.

రామ్ చరణ్ ‘ధృవ’కు పని చేసిన వేమారెడ్డితో పాటు మధు అనే రచయిత ముందుగా ఈ స్క్రిప్టును వర్కవుట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా రైజ్ అయిన సాయిమాధవ్ బుర్రా వీళ్లకు కలిశాడు. సినిమాలో మెజారిటీ డైలాగ్స్ రాస్తున్నది అతనే. ఇప్పుడు తాజాగా మరో రచయిత కూడా ఈ టీంకు కలిసినట్లు సమాచారం. కొన్నేళ్ల కిందట అజయ్ హీరోగా ‘సారాయి వీర్రాజు’ అనే సినిమా తీసిన డీఎస్ కన్నన్ సైతం ‘ఉయ్యాలవాడ’కు కొంతమేర రచనా సహకారం అందిస్తున్నాడట.

అంటే మొత్తంగా చిరు కోసం అరడజను మంది రచయితలు పని చేసినట్లన్నమాట. మరి ఇంత మంది కలిసి ‘ఉయ్యాలవాడ’ను ఎంత గొప్పగా తీర్చిదిద్దారో? ఇలాంటి సందర్భంలోనే టూ మెనీ కుక్స్.. అనే సామెత గుర్తుకొస్తుంది. అలా కాకుండా చూసుకుంటే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు