అంత భారీ సినిమా.. వీళ్లతో అవుతుందా?

అంత భారీ సినిమా.. వీళ్లతో అవుతుందా?

‘బాహుబలి’ రెండు భాగాలకు కలిపి ఇంతకుముందు అనుకున్న బడ్జెట్ రూ.250 కోట్లు. ఈ మధ్య నిర్మాత బడ్జెట్ రూ.450 కోట్లు అని చెప్పేవరకు.. ఆ సినిమా ఖర్చు రూ.250 కోట్లే అనుకుంటూ వచ్చారు.

అప్పటికి అదే ఇండియాలో అత్యధిక బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమా. అలాంటి సమయంలోనే శంకర్-రజినీకాంత్ కాంబినేషన్లో ‘రోబో’ సీక్వెల్ అనౌన్స్ చేశారు. దాని బడ్జెట్ రూ.350 కోట్లన్నారు. ఈ ప్రకటన వచ్చాక సుందర్.సి తాను తీయబోయే భారీ ప్రాజెక్టు గురించి ప్రకటన చేశాడు. అప్పటికి ‘2.0’లో బిగ్గెస్ట్ ఎవర్ అనుకుంటుండగా.. సుందర్ తాను తీయబోయేదే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్నాడు. ఖర్చు పక్కాగా ఇంత అని చెప్పలేదు కానీ.. హైయెస్ట్ ఎవర్ అని మాత్రం చెప్పాడు. అంటే ఓ 400 కోట్లు వేసుకోవచ్చేమో.

ఐతే రూ.400 కోట్ల బడ్జెట్ పెడుతున్నపుడు.. ఆ సినిమాను మార్కెట్ చేసుకోవడానికి తగ్గట్లుగా అన్ని ఆకర్షణలూ జోడించడం కీలకం. ఐతే సుందర్ ఏమీ రాజమౌళి కాదు. హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు పరుగులు పెట్టేయడానికి. అసలు రాజమౌళి లాంటి వాడే.. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ లాంటి స్టార్ హీరోను తీసుకున్నాడు. కానీ తనకంటూ గొప్ప ఇమేజ్ ఏమీ లేని సుందర్.. జయం రవి లాంటి మీడియం రేంజ్ హీరోను తన సినిమాకు కథానాయకుడిగా ఎంచుకున్నాడు. అతనేమీ పెద్ద స్టార్ కాదు. పైగా అతడి ఫాలోయింగ్ తమిళనాడుకే పరిమితం.

సుందర్ ఎంచుకున్న రెండో హీరో ఆర్య పరిస్థితి దయనీయంగా ఉంది. గత కొన్నేళ్లలో అతను బాగా డౌన్ అయిపోయాడు. తమిళనాడు అవతల అతడికీ ఫాలోయింగ్ లేదు. ఇలాంటి హీరోల్ని పెట్టుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసి.. దాన్ని తమిళనాడు అవతల ఎలా మార్కెట్ చేసుకుంటారు.. జనాల్ని ఎలా ఆకర్షిస్తారు.. అన్నది సందేహం. మరి సుందర్ గారి ధీమా ఏంటో.. నిర్మాతల్ని అతను ఎలా ఒప్పించాడో మరి.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు