అంత నమ్మితే ఇలా చేశావేంటి రాజా?

 అంత నమ్మితే ఇలా చేశావేంటి రాజా?

‘సర్కార్-3’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మతో సినిమాలు చేసినందుకు.. చేస్తున్నందుకు తనకెలాంటి రిగ్రెట్స్ లేవన్నాడు. భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలోనూ తనకు చింతేమీ లేదన్నాడు. కానీ బిగ్-బి సంగతేమో కానీ.. ఆయన అభిమానులు మాత్రం వర్మతో బంధాన్ని కొనసాగిస్తున్నందుకు చాలానే ఫీలవుతున్నారు. 70 ప్లస్ వయసులోనూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా కొనసాగుతూ.. చాలా మంది దర్శకుల్ని వెయిటింగ్ లో పెట్టిన అమితాబ్.. వర్మతో ఏరికోరి ‘సర్కార్-3’ చేసినందుకు చాలా బాధపడుతున్నారు అభిమానులు. ముందు నుంచి సందేహిస్తున్నట్లే ‘సర్కార్-3’కి ఫ్లాప్ టాక్ రావడంతో వర్మ మీద మండి పడుతూ.. అమితాబ్ ను సైతం తిట్టిపోస్తున్నారు ఫ్యాన్స్.

గతంలో ‘ఆగ్’.. ‘నిశ్శబ్ద్’.. ‘రణ్’.. ‘డిపార్ట్ మెంట్’ లాంటి సినిమాలతో బిగ్-బికి చేదు అనుభవాలు మిగిల్చాడు వర్మ. వీటిలో ముఖ్యంగా ఆగ్.. డిపార్ట్ మెంట్ సినిమాలు అమితాబ్ కెరీర్లోనే అత్యంత చెత్త చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. అమితాబ్ కెరీర్లో తొలి రోజు అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ‘డిపార్ట్ మెంట్’ రికార్డు నెలకొల్పింది. ఆ చిత్రం రూ.2.75 కోట్లు సాధించింది. ఐతే ఆ సినిమా వచ్చిన చాలా ఏళ్ల తర్వాత వచ్చిన సర్కార్-3 అంత కంటే తక్కువ వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యం. ఈ చిత్రానికి తొలి రోజు కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టే ఈ సినిమాపై ఎంత తక్కువ అంచనాలున్నాయో.. నెగెటివ్ టాక్ ఎంత వేగంగా స్ప్రెడ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దెబ్బతో బిగ్-బి వర్మతో ఇంకో సినిమా చేసే అవకాశాలకు తెరపడినట్లే అని.. వీళ్ల కాంబినేషన్లో సర్కార్-4 వచ్చేందుకు ఎంత మాత్రం ఆస్కారం లేదని తేలిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు