బాహుబలి కోసమే దాన్ని ఆపారట..

బాహుబలి కోసమే దాన్ని ఆపారట..

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితే కాదు.. దర్శకుడు కూడా. ఐతే రచయితగా విజయవంతమైనట్లు.. దర్శకుడిగా కాలేకపోయారు విజయేంద్ర ప్రసాద్. ఆయన దశాబ్దం కిందటే తన దర్శకత్వంలో రూపొందించిన ‘శ్రీకృష్ణ 2006’ ఫ్లాపైంది. ఆ తర్వాత కొన్నేళ్ల కిందట తీసిన ‘రాజన్న’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ.. డబ్బులు తేలేకపోయింది.

ఈ రెండు విఫల యత్నాల తర్వాత విజయేంద్ర ప్రసాద్ అందరూ కొత్తవాళ్లను పెట్టి కన్నడ.. తెలుగు భాషల్లో ‘శ్రీవల్లి’ అనే సినిమా తీశారు. ఐతే ఈ సినిమాకు ఆశించినంత హైప్ రాలేదు. బిజినెస్ కూడా జరగలేదు. దీంతో కొన్ని నెలలుగా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉందీ సినిమా.

అప్పుడెప్పుడో ఆడియో వేడుక చేసి.. త్వరలోనే రిలీజ్ అన్నారు కానీ.. అప్పట్నుంచి ఈ సినిమా వార్తల్లోనే లేదసలు. ఐతే కొన్ని నెలల నుంచి బాహుబలి గురించే మాట్లాడుతూ వచ్చిన విజయేంద్ర ప్రసాద్.. ఎట్టకేలకు తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గురించి పెదవి విప్పాడు.

తాము కావాలనే ‘శ్రీవల్లి’ని పక్కన పెట్టినట్లుగా విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ‘శ్రీవల్లి’లో అందరూ కొత్తవాళ్లే నటించారని.. టెక్నీషియన్స్.. నిర్మాతలు కూడా కొత్తవాళ్లే అని.. తాను ఒక్కడు మాత్రమే ప్రేక్షకులకు పరిచయమని.. అందుకే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైతే.. తన వల్ల ‘శ్రీవల్లి’కి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని భావించి.. ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

త్వరలోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మనసులోని చెడు ఆలోచనల్ని చెరిపేసేందుకు జరిగే ఓ ప్రయోగం నేపథ్యంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్నిరూపొందించినట్లు ఆయన తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు