సౌత్‌లో పడ్డాడు.. బాలీవుడ్‌లో లేచాడు

సౌత్‌లో పడ్డాడు.. బాలీవుడ్‌లో లేచాడు

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఇటు తెలుగులో.. అటు తమిళంలో మంచి ఫాలోయింగే ఉంది. సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అతనొకడు. ఇక్కడ చాలా మంది స్టార్ హీరోలతో పని చేశాడు. ఐతే ఈ మధ్య సౌత్ లో తమన్ జోరు బాగా తగ్గిపోయింది. గత ఏడాదిన్నరలో తమన్ పని చేసిన స్టార్ హీరో సినిమా ఒక్కటే. అదే.. ‘సరైనోడు’. ఆ సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్టయినప్పటికీ తమన్‌కు సరైన అవకాశాలు రాలేదు.

తెలుగులోనే కాదు.. తమిళంలోనూ తమన్ ఇంతకుముందులాగా బిజీగా లేడు. స్టార్ హీరోల సినిమాలు తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో తమన్ కెరీర్ కు పెద్ద బూస్ట్ ఇచ్చే ఆఫర్ వచ్చింది. అతను బాలీవుడ్లో ఓ క్రేజీ మూవీతో అరంగేట్రం చేయబోతున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గోల్ మాల్’ సిరీస్ కొత్త సినిమాకు తమనే సంగీత దర్శకుడు కావడం విశేషం.

బాలీవుడ్ సంగీత దర్శకులు సౌత్ సినిమాలకు పని చేయడం మామూలే కానీ.. ఇక్కడి వాళ్లు బాలీవుడ్డుకెళ్లడం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇప్పటిదాకా బాలీవుడ్లో సినిమానే చేయకపోవడం గమనార్హం. తెలుగులో తన అవకాశాల్ని కూడా తన్నుకుపోతున్న దేవికి తమన్ ఒక రకంగా ఝలక్ ఇచ్చినట్లే. ‘గోల్ మాల్’ తరహా అల్లరి సినిమాలకు తమన్ మ్యూజిక్ బాగా సూటవుతుందని.. అతనీ సినిమాతో అక్కడ మంచి పేరు సంపాదించే అవకాశముందని భావిస్తున్నారు.

‘గోల్ మాల్’ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఇది ఒకటి. అజయ్ దేవగన్ తో పాటు ఇంకో ఐదారుగురు హీరో హీరోయిన్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. మరి ఈ సినిమాతో తమన్ బాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేస్తాడో.. అక్కడ మున్ముందు ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు