వైట్ల.. వినాయక్.. కింకర్తవ్యం?

వైట్ల.. వినాయక్.. కింకర్తవ్యం?

సినీ పరిశ్రమలోకి కొత్త నీరు రావడం.. పాత నీరు పోవడం సహజం. ఇక్కడ ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదు. దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో ఆధిపత్యం చలాయించిన కొందరు స్టార్ డైరెక్టర్ల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. తెలుగు సినిమా సరికొత్త మార్పు దిశగా వడి వడిగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఈ దర్శకుల భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

ఒకప్పుడు తమ సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ దర్శకులు.. ఇప్పుడు కొత్త ట్రెండుకు తగ్గట్లు సినిమాలు తీయలేక ఇబ్బంది పడిపోతున్నారు. కొత్త దర్శకుల నడుమ ఉనికిని నిలుపుకోలేకపోతున్నారు. హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన వి.వి.వినాయక్.. శ్రీను వైట్లల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ‘మిస్టర్’ లాంటి డిజాస్టర్ తీసిన వైట్ల పరిస్థితేంటో.. ‘ఖైదీ నంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వినాయక్ పరిస్థితి కూడా అదే కావడమే విడ్డూరం.

వి.వి.వినాయక్ ఈ మధ్యే ‘ఖైదీ నెంబర్ 150’తో బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ సినిమా విజయంలో క్రెడిట్ ఏమాత్రం వినాయక్‌కు దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది రీమేక్ మూవీ. కాబట్టి దర్శకుడికి మామూలుగానే క్రెడిట్ రావడం కష్టం. పైగా ఇది చిరంజీవి రీఎంట్రీ మూవీ కావడంతో ఆయన్ని మళ్లీ తెరపై చూడటం కోసం జనాలు ఎగబడటంతో సినిమా అంతలా ఆడేసింది తప్ప.. ఇందులో దర్శకుడి ప్రతిభేమీ లేదని తీర్మానించేశారు విశ్లేషకులు. ‘ఖైదీ నెంబర్ 150’ కంటే ముందు వినాయక్ తీసిన ‘అఖిల్’ పెద్ద డిజాస్టర్. దానికి ముందు కూడా వినాయక్ సినిమాలు అంతగా ఆడలేదు.

గత కొన్నేళ్లలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారి.. కొత్త తరహా సినిమాల కోసం చూస్తున్న నేపథ్యంలో వినాయక్ తరహా రొటీన్ మాస్ మసాలా సినిమాలు ఇప్పుడు వర్కవుటయ్యే పరిస్థితి లేదు. ఆ టైపు సినిమాలు చేయడానికి హీరోలు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకే ‘ఖైదీ నెంబర్ 150’ అంత పెద్ద హిట్టయినా కూడా వినాయక్‌తో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేదు. వినాయక్‌కు సొంతంగా కథ రెడీ చేసుకుని.. దానికి తగ్గ హీరోల్ని ఎంచుకునే అలవాటు లేదు. అతను హీరోలు.. రచయితల మీద ఆధారపడతాడు. ఎవరైనా హీరో ఓకే చెబితే.. అతడికి తగ్గట్లుగా తన రచయితలతో కథ రెడీ చేయిస్తాడు. కానీ ఇప్పుడు అందుబాటులో ఏ స్టార్ హీరో లేకపోవడంతో వినాయక్ ఖాళీగా ఉన్నాడు. అసలు ఈ ఏడాది వినాయక్ సినిమా మొదలవుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.

ఇక వైట్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు అతడి వెంట తిరిగిన నిర్మాతలందరూ ఇప్పుడు అతడి పేరు చెబితే వామ్మో అంటున్నారు. గతంలో వరుస హిట్లతో తిరుగులేని స్థాయిని అందుకున్న వైట్ల.. మూడే మూడు సినిమాలతో పాతాళానికి పడిపోయాడు. ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్.. మూడూ కూడా నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చాయి. ఒక సినిమా డిజాస్టర్ అయ్యాక.. తర్వాతి కథాకథనాల పరంగానే కాక.. బడ్జెట్ పరంగానూ జాగ్రత్త పడటం సహజం. కానీ వైట్ల ఇందుకు భిన్నం. అతను కొత్తదనం కోసం ప్రయత్నించడం లేదు. బడ్జెట్లూ కొండెక్కించేస్తున్నాడు. వరుణ్ తేజ్ లాంటి అప్ కమింగ్ హీరోను పెట్టి కూడా అతను భారీ బడ్జెట్ పెట్టించేశాడు. ఆ సినిమాకు రూ.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో అసలే ప్రమాదంలో ఉన్న వైట్ల కెరీర్ ఈ సినిమాతో మరింత హీన స్థితికి చేరింది. మిస్టర్’ చూశాక వైట్ల ఇక మారడన్న నిర్ణయానికి ఇండస్ట్రీ జనాలు. వైట్లకు ఇప్పుడు ఇంకో అవకాశం దొరకడం సందేహంగానే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు