పొంచి ఉన్న మూడో వేరియెంట్‌: భార‌త్‌కు మ‌రింత ముప్పు!

ప్ర‌స్తుతం రెండో ద‌శ క‌రోనాతో అల్లాడిపోతున్న భార‌త్‌కు మ‌రో ముప్పు పొంచి ఉంద‌ని అంటున్నారు ప్ర‌పంచ స్థాయి వైద్య‌, ఆరోగ్య నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధ‌త అత్యంత ముఖ్య‌మ‌ని హెచ్చిస్తున్నారు. క‌రోనా మూడో ద‌శ ఇప్ప‌టికే వివిధ దేశాల్లో ప్ర‌భావం చూపిస్తోంద‌ని, దీంతో ఆయా దేశాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నార‌ని, ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో భార‌త్‌లోనూ వ‌చ్చే రెండు మూడు మాసాల్లో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌కు అవ‌కాశం ఉంద‌ని.. దీనిని ఇప్ప‌టి నుంచే గుర్తించాల్సిన అస‌వ‌రం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

“ప్ర‌స్తుతం రెండో ద‌శ‌ను త‌ట్టుకునేందుకు భార‌త్ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అయినా.. మౌలిక సదుపాయాలు.. స‌రిపోవ‌డం లేదు. ప్ర‌తి రోజూ వ్యాక్సిన్ ఇస్తున్నామ‌ని చెబుతున్నా.. 139 కోట్లకు పైగా ఉన్న జ‌నాభాలో యువ‌త‌, మ‌ధ్య‌వ‌య‌స్కులు ఎక్కువ‌గా ఉన్నారు. వీరిని కాపాడుకోవ‌డం అత్యంత అవ‌శ్యం. మూడో ద‌శ ప్రారంభం అయితే.. భార‌త్‌లో ప‌రిస్థితులు మ‌రింత తీవ్రం అవుతాయి. ఇప్ప‌టికీ.. దేశంలో 15 కోట్ల మందికి కేవ‌లం తొలి ద‌శ వ్యాక్సినేష‌న్ పూర్త‌యింది. రెండో ద‌శ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. అయితే.. ప్ర‌స్తుతానికి కేవ‌లం 9 శాతం(15 కోట్లు) మందికి మాత్ర‌మే వ్యాక్సిన్ పూర్త‌యింది.

సో.. ఈ తొలి ద‌శ ప్ర‌క్రియ పూర్తికావాలి. ఆవెంట‌నే నెల రోజుల వ్య‌వ‌ధిలో.. మ‌ళ్లీ.. రెండో డోస్ ఇవ్వాలి. ఈ ప్ర‌క్రియ ముగిసేందుకు క‌నీసం ఏడాది స‌మ‌యం ప‌డుతుంద‌ని.. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో నాలుగు మాసాల్లోనే మూడో వేరియంట్ వ‌చ్చే ప్ర‌మాదం ఉందని అంటున్నారు ప్ర‌పంచ స్థాయి నిపుణులు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌క్ష‌ణమే విదేశీయుల‌ను దేశంలోకి రాకుండా ఆపేయాల‌ని.. అదేవిధంగా ఎగుమ‌తుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డం.. ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ అందించ‌డం వంటి కీల‌క అంశాల‌పై దృష్టి సారించాల‌ని.. అన్ని రూపాల్లోనూ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు అడుగులు వేయాల‌ని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ ప‌రిష్కారం కాక‌పోయినా.. దీనికి స‌మాంతరంగా.. చ‌ర్య‌లు తీసుకోవాలి. అదేస‌మ‌యంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ వ‌చ్చేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచిస్తున్నారు. అయితే.. భార‌త్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వ‌చ్చేందుకు.. రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. లేక‌పోతే.. మూడో వేవ్‌కు అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.