ఇది 'బాహుబలి'కి మించిన బీటింగ్‌

ఇది 'బాహుబలి'కి మించిన బీటింగ్‌

'దంగల్‌' రికార్డులని 'బాహుబలి 2' కొట్టి ఎంతో కాలం కాలేదు. ఇంతలోనే బాహుబలి రికార్డులని వెంటాడుతూ 'దంగల్‌' మళ్లీ మోత మోగించడం మొదలైంది. ఆలస్యంగా చైనాలో విడుదలైన అమీర్‌ఖాన్‌ చిత్రం అక్కడ బీభత్సం చేసేస్తోంది. మొదటి వారంలో సాదాసీదాగా మొదలైన 'దంగల్‌' బాక్సాఫీస్‌ జర్నీ తర్వాత్తర్వాత తీవ్ర రూపం దాల్చింది.

మొదటి శనివారం 4.69 మిలియన్‌ డాలర్ల వసూళ్లు వస్తే, రెండవ శనివారం 13.86 మిలియన్‌ డాలర్లు వసూలయ్యాయి. మొదటి ఆదివారం  5.55 మిలియన్‌ డాలర్లు వసూలు కాగా, రెండవ ఆదివారం 12.50 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. ముందుకు వెళ్లే కొద్దీ మరింతగా వసూలు చేస్తోన్న దంగల్‌ కేవలం పది రోజుల్లోనే చైనాలో నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇండియాలోనే దంగల్‌ అయిదు వందల కోట్ల గ్రాస్‌ సాధిస్తే, దంగల్‌ చైనాలో అంతకంటే ఎక్కువ సాధించే దిశగా దూసుకు పోతోంది.

బాహుబలి పన్నెండు వందల కోట్లకి పైగా వసూళ్లు సాధించినప్పటికీ దాంట్లో వెయ్యి కోట్లు ఇండియాలోనే వచ్చాయి. కానీ దంగల్‌ చైనా నుంచే ఆరు వందల కోట్లకి పైగా వసూళ్లు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే దంగల్‌ ఇండియాతో పాటు మిగిలిన దేశాల్లో సాధించిన వసూళ్లతో సమానంగా చైనాలో సాధించడం కష్టమేమీ కాదనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు