ఈ అజిత్ అభిమానులున్నారే..

ఈ అజిత్ అభిమానులున్నారే..

తమిళనాట అభమానుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. పోరు అంటే నేరుగా కొట్టేసుకోవడం కాదు.. ఆన్ లైన్లో రికార్డుల పేరుతో ఫైటింగ్ అన్నమాట. ముఖ్యంగా విజయ్.. అజిత్ అభిమానుల మధ్య గత కొన్నేళ్ల నుంచి ఆన్ లైన్ వార్ గట్టిగా నడుస్తోంది.

తమ హీరో కొత్త సినిమాకు సంబంధించి టీజరో.. ట్రైలరో రిలీజైందంటే దానికి వ్యూస్.. లైక్స్ పరంగా రికార్డులు బద్దలైపోవాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అభిమానులు. మూడు రోజుల కిందటే అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఆ టీజర్ ఆన్ లైన్లో ప్రకంపనలు రేపుతోంది. కేవలం 68 గంటల్లో ఈ టీజర్ కోటి వ్యూస్ పూర్తి చేసుకోవడం విశేషం.

సౌత్ ఇండియాలో ఒకే భాషలో రిలీజైన ఏ టీజర్ కూడా ఇప్పటిదాకా ఇంత వేగంగా 10 మిలియన్ మార్కును అందుకున్నది లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ టీజర్ 72 గంటల్లో కోటి వ్యూస్ తెచ్చుకుంది. అప్పుడు దానికే అందరూ ఆశ్చర్యపోయారు. సూపర్ స్టార్ ఫాలోయింగ్ ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అజిత్ రజినీ రికార్డునే బద్దలు కొట్టేయడం అంటే మాటలు కాదు.

ఈ టీజర్‌కు ఇప్పటిదాకా 3.4 లక్షల లైక్స్ రావడం విశేషం. ఇది కూడా రికార్డే. ఇంతకుముందు విజయ్ సినిమాలు తెరి.. భైరవ నెలకొల్పిన రికార్డులన్నింటినీ అజిత్ మూవీ టీజర్ దాటేయడంతో తల అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అజిత్‌తో వీరం, వేదాలం సినిమాలు తీసిన శివ ‘వివేగం’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు