అందరికీ దేవీనే కావాలి..

అందరికీ దేవీనే కావాలి..

ఓ పక్క మణిశర్మ దంచుతుంటే.. ఇంకోవైపు దేవిశ్రీ ప్రసాద్ వాయించేవాడు. మరోవైపు ఆర్పీ పట్నాయక్ ఉండేవాడు. ఇంకా చక్రి సినిమాలు చక్రికి ఉండేవి. కీరవాణి కూడా బిజీగానే ఉండేవాడు. ఇలా దశాబ్దం కిందట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లంటూ చాలామందే కనిపించేవాళ్లు.

కానీ ఇప్పుడలా లేదు. మెగాస్టార్ చిరంజీవికీ దేవిశ్రీ ప్రసాదే కావాలి.. రామ్ చరణ్‌కూ అతనే కావాలి. ఎన్టీఆర్‌కూ అతనే వాయించాలి. నాగచైతన్య సినిమాకూ అతనే పని చేయాలి. తెలుగులో ఏ భారీ ప్రాజెక్టు మొదలైనా.. దేవిశ్రీనే ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు. అతడిలా ఇంకెవ్వరూ బిజీగా లేరిప్పుడు. మిగతా సంగీత దర్శకులందరూ దేవీలా ఉన్న ఫామ్‌లో లేరు.

దేవిని నమ్ముకుంటే సినిమా మ్యూజికల్‌గా హిట్టయిపోతుందని.. తన సంగీతంతో సినిమాను సగం నిలబెట్టేస్తాడని దర్శక నిర్మాత నమ్మకం. ఇటీవల అతడి ట్రాక్ రికార్డు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. గత ఏడాది నేను శైలజ, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్ లాంటి మ్యూజికల్ హిట్లు వచ్చాయి దేవి నుంచి. వీటిలో ‘సర్దార్’ మినహా అన్నీ సూపర్ హిట్లే. ఆ సినిమా సైతం ఆడియో పరంగా ఆకట్టుకుంది.

ఇక ఈ ఏడాది ‘ఖైదీ నెంబర్ 150’, ‘నేను లోకల్’ లాంటి మ్యూజికల్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడతను. ప్రస్తుతం రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జగన్నాథం, రామ్ చరణ్-సుకుమార్ సినిమా, భరత్ అను నేను, జై లవకుశ, రామ్-కిశోర్ తిరుమల మూవీ, ఎంసీఏ లాంటి క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు దేవి.

గత కొన్నేళ్లలో తెలుగులో దేవికి గట్టి పోటీ ఇచ్చిందంటే అది తమనే. కానీ ఈ మధ్య అతడి జోరు తగ్గింది. పెద్ద సినిమాల్లో అవకాశాలు పెద్దగా రావట్లేదు. సినిమాలు తగ్గిపోయాయి. గత ఏడాది కాలంలో అతను సంగీతమందించిన పెద్ద సినిమా అంటే.. ఒక్క ‘సరైనోడు’ మాత్రమే. మిగతావన్నీ మీడియం రేంజి సినిమాలే. ఇంతకుముందు లాగా స్టార్ హీరోలు, డైరెక్టర్లు అతణ్ని ప్రిఫర్ చేయట్లేదు.

ప్రస్తుతం తమన్ చేతిలో ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేకపోవడం గమనార్హం. దేవిశ్రీ ప్రసాద్, తమన్‌ల తర్వాత గత కొన్నేళ్లలో బాగా రైజ్ అయి స్టార్ ఇమేజ్ సంపాదించిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ‘టెంపర్’, ‘కాటమరాయుడు’ లాంటి పెద్ద అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అనూప్‌లో టాలెంట్ ఉన్నప్పటికీ అతను క్లాస్ సినిమాలకు మాత్రమే సూటవుతాడన్న అభిప్రాయం బలపడింది. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీకి ప్రయారిటీ మరింత పెరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు