ఏపీకి రైల్వేజోన్‌...ఇదో కామెడీ ఇష్యూ!

ఏపీకి రైల్వేజోన్‌...ఇదో కామెడీ ఇష్యూ!

ప్ర‌త్యేక రైల్వే జోన్‌...సుదీర్ఘ కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసుల ఆకాంక్ష‌. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆనాటి ప్ర‌భుత్వం ఈ క‌ల‌ను నెరవేరుస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ-బీజేపీ ద్వ‌యం తాము సాకారం చేసి చూపిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. అయితే అడుగు ముందుకుప‌డ‌లేదు. సాక్షాత్తు కేద్ర రైల్వే శాఖా మంత్రి ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ‌డంతో ఆశ‌లు చిగురించాయి. కానీ రైల్వే అధికారుల తీరు చూస్తే ఏపీకి రైల్వే జోన్ అయ్యే ప‌నిలాగా లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

రైల్వే జోన్ విష‌యంలో ఇంత నిరాశ‌కు గురి అయ్యేందుకు కార‌ణంగా తాజాగా రైల్వే బోర్డు చైర్మెన్ ఏకే మిట్టల్‌ విశాఖ పర్యటన సాగిన తీరే. వచ్చారు.. వెళ్లారు... అన్నట్లుగానే చైర్మెన్‌ పర్యటన సాగింది.రైల్వేజోన్‌పై విశాఖలో పెద్ద ఉద్యమం, ఆందోళన జరిగిన నేపథ్యంలో మిట్టల్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ ఆయన జోన్‌ విషయాన్ని తేలికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జోన్‌ కోసం, ఇతర సమస్యలపై మెమోరాండం పట్టుకుని ఆయనతో భేటీకి బయల్దేరిన విశాఖ ఎంపీలకు చుక్కెదురైంది. తొలిసారిగా విశాఖ‌కు వచ్చిన ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిపిన సమీక్ష పూర్తిగా అరగంటసేపు లేకపోవడం రైల్వేవర్గాలను విస్మయపరిచింది. వినతుల స్వీకరణతోనే కొద్దిసేపు సరిపోగా, మిగిలిన కొద్ది నిమిషాలు డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఇది కూడా సంతృప్తికరంగా జరగకపోవడంతో అసలు ఎందుకు వచ్చారు? ఇందులో కీలకం ఏమిటి? అనే అంశంపై రైల్వేవర్గాల్లో చర్చనీయాంశమైంది. చివరకు ఎంపీల ఇక్కడి రైల్వేసమస్యలపై వినతులు అందజేయడంతోనే సరిపోయింది త‌ప్ప వారితో చ‌ర్చించింది లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, ఇంతకీ కేవలం 20 నిమిషాలు మాత్రమే జరిగిన సమావేశం రహస్యం మాత్రం బయటకు పొక్కలేదు. అధికారులు తమకు ఏమీ తెలియదనే మాట చెబుతుండగా, ప్రజాప్రతినిధులు, రైల్వే కార్మిక సంఘాల ప్రతినిధులు మాత్రం సమస్యలతో కూడిన వినతులు అందివ్వడంతోనే సరిపెట్టారు. ఆ తరువాత కొద్దిసేపు అధికారులతో ఏఏ అంశాలపై చర్చించారో అధికారికంగా తెలుప‌లేదు. అంతగా మిస్టరీగా సాగిపోయింది తప్పితే ఏ ఒక్క అంశంపైనే దృష్టిసారించలేదనేది తేలిపోయింది. వ్యక్తిగత కార్యక్రమంపై వచ్చారనే కొంతమంది, లేదు మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగమే ఇది అంటూ మరికొంతమంది చెప్పడంతో అసలు ఎందుకొచ్చినట్టు అనేది రైల్వేవర్గాల్లో, విశాఖ వాసుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు