తమిళ బాహుబలి తెలుగులో సేలైపోయింది

తమిళ బాహుబలి తెలుగులో సేలైపోయింది

‘బాహుబలి’ లాంటి సినిమా తామూ తీయగలమని రుజువు చేసుకోవడానికి కోలీవుడ్ దర్శక నిర్మాతలు తహతహలాడిపోతున్నారు. ఆల్రెడీ ‘పులి’ అనే సినిమా ఒకటి ట్రై చేశారు. కానీ అది తీవ్రంగా నిరాశ పరిచింది. ఐతే ఈసారి ‘బాహుబలి’ని మరిపించే సినిమా తీసే బాధ్యతలు సీనియర్ దర్శకుడు సుందర్ తలకెత్తుకున్నాడు.

‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని బడ్జెట్లో.. అంతే భారీ తనంతో.. అదే స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో.. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో ‘సంఘమిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుట్టాడు సుందర్. ఇంకో రెండు మూడు రోజుల్లోనే ఆ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా లాంచ్ కానుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ఆరంభమవుతుంది.

ఈ చిత్రాన్ని తమిళంలో తీసి మిగతా భాషల్లో అనువాదం చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ హక్కులు ఇప్పటికే సేల్ అయిపోయినట్లు సమాచారం. తమిళ అనువాదాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అందించబోతున్నాడట. ఆయన ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ సినిమాను కొనేశారట.

నిజానికి ఈ సినిమా స్టార్ కాస్ట్ చూసి తెలుగు నిర్మాతలు హక్కుల కోసం ఎగబడేంత సీన్ అయితే లేదు. ఇందులో హీరోలుగా నటిస్తున్న జయం రవి.. ఆర్య మనవాళ్లకు అంత పరిచయం లేదు. వాళ్లకు ఇక్కడ మార్కెట్ లేదు. హీరోయిన్ శ్రుతి హాసన్‌తో మాత్రమే మనవాళ్లు కనెక్టవుతారు. దర్శకుడు సుందర్ మీద కూడా ఇక్కడి వాళ్లకు గురి ఏమీ లేదు. అతను ఇప్పటిదాకా మామూలు సినిమాలే తీశాడు. మరి ‘సంఘమిత్ర’ను అతను రాజమౌళి లాగా తీర్చిదిద్దగలడా అన్నది సందేహం. ఈ సినిమా తెలుగులో ఏమాత్రం వర్కవుటవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు