శంకరాభరణం హక్కుల్ని 50 వేలకు ఇవ్వబోతే...

శంకరాభరణం హక్కుల్ని 50 వేలకు ఇవ్వబోతే...

‘శంకరాభరణం’ సినిమా తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అప్పట్లో తమిళనాట హౌస్ ఫుల్ కలెక్షన్లతో చాలా కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

తమిళంలోకి డబ్ అయిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. పెట్టుబడి మీద అత్యధిక రెట్లు లాభాలు తెచ్చుకున్న తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఇది ఒకటి.

 ఐతే ‘శంకరాభరణం’ అనువాద హక్కుల్ని నామమాత్రపు ధరకు ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు చంద్రమోహన్‌కు ఇవ్వబోతే ఆయన తీసుకోవడానికి నిరాకరించారట. ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వాపోయారు చంద్రమోహన్.

‘‘శంకరాభరణం తమిళ అనువాద హక్కుల్ని అమ్మడానికి ప్రయత్నించగా ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. సినిమా చూసి ప్రశంసించేవాళ్లే కానీ.. హక్కులు కొని రిలీజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఐతే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు నాకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా.. దాని బదులు తమిళనాడు హక్కులు తీసుకోమని కోరారు. ఐతే నాకు పారితోషకం ఎగ్గొట్టడానికే ఆయన ఇలా చేస్తున్నారని.. తమిళనాడు హక్కులతో నాకేం వస్తుందని అనుకుని.. నేను హక్కులు వద్దని చెప్పి డబ్బులే ఇవ్వమన్నాను. ఆ తర్వాత ఈ సినిమాను మనోరమ గారికి.. ప్రివ్యూ వేసి చూపించారు. ఆమె సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుని.. గొప్ప సినిమా తీశారంటూ విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు గార్లకు పాదాభివనందనం చేశారు. దర్శకుడు పి.వాసు తండ్రి పీతాంబరం గారితో కలిసి హక్కులు తీసుకుని సినిమాను తమిళనాట రిలీజ్ చేశారు. ఆ చిత్రం ఏకంగా కోటిన్నర రూపాయలు వసూలు చేసింది. నేను హక్కులు తీసుకోనందుకు చాలా బాధపడ్డాను’’ అని చంద్రమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు