బాహుబలి-2లో ఆ సీన్ చూసి కన్నీళ్లేనట..

బాహుబలి-2లో ఆ సీన్ చూసి కన్నీళ్లేనట..

‘బాహుబలి: ది కంక్లూజన్’లో అత్యంత హృద్యంగా.. భావోద్వేగంతో సాగే సన్నివేశాల్లో అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత వచ్చే సీన్ ఒకటి. సినిమాలో ఇన్వాల్వ్ అయిన ఏ ప్రేక్షకుడికైనా ఈ సీన్ చూస్తే గుండె తడి అవ్వడం ఖాయం. బాహుబలి తన వల్ల అకారణంగా చనిపోయాడని తెలుసుకుని.. శివగామి తన చేత్తో బాహుబలిని తడుముతున్న అనుభూతితో కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాన్ని చాలా బాగా తీశాడు రాజమౌళి. ప్రివ్యూ థియేటర్లో ఈ సీన్ చూసి తాను నిజంగానే కన్నీళ్లు పెట్టేసుకున్నానని రమ్యకృష్ణ తెలిపింది. మామూలుగా తాను నటించిన సినిమా చూసి తాను అంత భావోద్వేగానికి గురి కానని.. కానీ ఈ సన్నివేశం మాత్రం తనతో కన్నీళ్లు పెట్టించేసిందని రమ్యకృష్ణ తెలిపింది.

‘‘నేను ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను నేపథ్య సంగీతం లేకుండా చూశాను. అలా చూసినపుడే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. శివగామి దగ్గరికొచ్చి బాహుబలికి సంబంధించిన నిజాల్ని కట్టప్ప వెల్లడించాక బాహుబలిని తలుచుకుని ఆవేదన చెందే సీన్ చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది. ఈ సీన్‌ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది అయినప్పటికీ.. అందులో నాకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. ఆ సన్నివేశాన్ని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. అది అతడి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం’’ అని రమ్యకృష్ణ తెలిపింది.

‘నరసింహా’లో నీలాంబరిగానే ప్రేక్షకులకు తాను గుర్తుండి పోతానని అనుకుంటే.. ఇప్పుడు శివగామిగా రాజమౌళి తనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టాడని రమ్యకృష్ణ చెప్పింది. తాను ఏ పాత్రా ప్లాన్ చేసుకుని చేయలేదని.. తనకు డ్రీమ్ రోల్స్ ఏమీ లేవని.. తన దగ్గరికి వచ్చే పాత్రల్ని చేసుకుంటూ వెళ్లిపోవడమే అని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు