వర్మను ఆడుకుంటున్న నేషనల్ మీడియా

వర్మను ఆడుకుంటున్న నేషనల్ మీడియా

రామ్ గోపాల్ వర్మకు, నేషనల్ మీడియా వాళ్లకు వైరం ఈనాటిది కాదు. మిగతా వాళ్ల లాగా వర్మ మీడియా అనగానే ఆచితూచి మాట్లాడే రకం కాదు. టీవీ స్టూడియోల్లో కూర్చుని.. చాలాసార్లు మీడియా గాలి తీశాడు వర్మ. అందుకే మీడియాను ఎప్పుడు దెబ్బ కొడదామా అన్నట్లు చూసే నేషనల్ మీడియా.. అప్పట్లో ముంబయి దాడులు జరిగినపుడు మహారాష్ట్ర సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ వెంట వర్మ వెళ్లడం మీద తీవ్ర దుమారం రేపే కథనాలు ప్రసారం చేసింది.

దీంతో ఒళ్లు మండిన వర్మ ‘రణ్’ పేరుతో మీడియా వాళ్లు టీఆర్పీ రేటింగుల కోసం ఎలా వ్యవహరిస్తారో చూపిస్తూ ఓ సినిమా తీశాడు. నిజానికి వర్మ దానికి ముందు, తర్వాత తీసిన సినిమాలతో పోలిస్తే అది బెటర్ మూవీనే అయినా మీడియా దాని మీద అదే పనిగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేసి తొక్కేసిందన్న అభిప్రాయాలున్నాయి బాలీవుడ్లో.

ఈ ఫ్లాష్ బ్యాక్‌లన్నీ పక్కనబెట్టేస్తే.. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నుంచి ‘సర్కార్-3’ వచ్చింది. ఈ సినిమా గురించి నేషనల్ మీడియాలో ముందు నుంచి వ్యతిరేక కథనాలే వస్తున్నాయి. పోయి పోయి అమితాబ్ బచ్చన్ వర్మతో ఇప్పుడు సినిమా చేశాడేంటంటూ చాలాసార్లు మీడియా వాళ్లు మొసలి కన్నీరు కార్చారు. ‘సర్కార్-3’కి అనుకున్నంత హైప్ రాకపోవడానికి వర్మ ట్రాక్ రికార్డుతో పాటు మీడియాలో జరిగిన వ్యతిరేక ప్రచారమూ కారణమే.

ఇప్పుడు ‘సర్కార్-3’కి నెగెటివ్ టాక్ రావడంతో వాళ్ల చేతికి ఆయుధం వచ్చినట్లయింది. ఇక రెచ్చిపోతున్నారంతే. నిన్న మార్నింగ్ షో పడ్డప్పటి నుంచి నేషనల్ పత్రికలకు సంబంధించిన వెబ్ సైట్లు.. అలాగే టీవీ ఛానెళ్లలో ‘సర్కార్-3’ ఆడేసుకుంటున్నారు. రాజీవ్ మసంద్ లాంటి ప్రముఖ క్రిటిక్ కూడా ‘సేమ్ షేమ్’ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ ‘సర్కార్-3’ని దునుమాడాడు. ఆయన 2 రేటింగ్ ఇస్తే.. కొందరు 1.5 రేటింగ్స్ కూడా ఇచ్చారు. మొత్తంగా ‘సర్కార్-3’ ఫ్లాప్ అని తొలి రోజే తీర్మానించేశారు. అసలే ఓపెనింగ్స్ లేని ఈ సినిమా.. ఈ వ్యతిరేక ప్రచారంతో కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుంచి లేచిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు