ఈ దెబ్బతో వర్మ జాతకం తేలిపోతుంది

ఈ దెబ్బతో వర్మ జాతకం తేలిపోతుంది

బాలీవుడ్లో వరుస ఫ్లాపులతో పాతాళానికి పడ్డాక.. విధి లేని పరిస్థితుల్లో కొన్నేళ్ల కిందట టాలీవుడ్‌కు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మళ్లీ హైదరాబాద్‌కు వచ్చినందుకు, తెలుగులో సినిమాలు చేయబోతున్నందుకు చాలా సంతోషించారు జనాలు. కానీ గత కొన్నేళ్లలో ఆయన నుంచి ఇక్కడ ఎలాంటి సినిమాలొచ్చాయో తెలిసిందే. దొంగల ముఠా, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్-2, 365 డేస్ లాంటి నాసిరకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు వర్మ.

చివరగా ఆయన నుంచి వచ్చిన ‘వంగవీటి’ కూడ నిరాశ పరిచింది. ఐతే ఈ లోపే హైదరాబాద్‌ నుంచి దుకాణం సర్దేసి.. ముంబయిలో మళ్లీ కంపెనీ పెట్టుకుని అక్కడ చేరిపోయాడు వర్మ. మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేది లేదంటూ శపథం చేసి అక్కడ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.

గత ఏడాది ఆయన తీసిన హిందీ సినిమా ‘వీరప్పన్’ తేలిపోయింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్‌ను పెట్టి ‘సర్కార్-3’ తీశాడు. ఐతే అమితాబ్ నటించినా సరే.. ‘సర్కార్-3’ మీద హిందీ ప్రేక్షకుల్లో అంత నమ్మకం కుదిరినట్లు లేదు. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్ క్రియేటటవ్వలేదు. బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒకటికి రెండుసార్లు సినిమా వాయిదా పడి.. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ‘సర్కార్-3’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. గతంలో వర్మ చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు.. ఇది వాటన్నింటికంటే చాలా పెద్దది. ఈ సినిమా ఫ్లాపైతే వర్మకు బాలీవుడ్లో ఇంకో అవకాశం దక్కడం కష్టమే.

‘న్యూక్లియర్’ అంటూ ఏదో ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చేయబోతున్నట్లు ఆ మధ్య చర్చ నడిచింది కానీ.. అందులో నిజం లేదనే అనిపిస్తోంది. అది చేయాలన్నా ముందు ‘సర్కార్-3’ హిట్టవ్వాలి. ఇది తేడా కొడితే వర్మ పని అంతే. బాలీవుడ్ సెలబ్రెటీలకు కానీ.. మీడియాకు కానీ వర్మ అంటే అస్సలు పడదు. అతడి మీద కోపంతో ‘సర్కార్-3’కి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా.. దాన్ని అట్టర్ ఫ్లాప్ చేయించే బాధ్యతను నెత్తికెత్తుకుంటారు. ఈ పరిస్థితుల్లో ‘సర్కార్-3’ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది.. ఎలాంటి ఫలితాన్నందుకుంటుందన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు