బాహుబలి పక్కన పడేయమని చెప్పాడట

బాహుబలి పక్కన పడేయమని చెప్పాడట

ఎనిమిది కోట్ల వ్యయంతో 'రన్‌ రాజా రన్‌' తీసిన దర్శకుడు సుజిత్‌ ఇప్పుడు రెండవ చిత్రానికి నూట యాభై కోట్ల బడ్జెట్‌ పొందాడు. 'బాహుబలి'తో ప్రభాస్‌ పరపతి జాతీయ వ్యాప్తంగా పెరగడంతో, 'సాహో' చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

సుజిత్‌కి ప్రభాస్‌ ఈ అవకాశాన్ని 'రన్‌ రాజా రన్‌' చూసిన వెంటనే ఇచ్చాడట. అయితే ఏదో జోక్‌ చేస్తున్నాడని అనుకుని కొద్ది రోజులు కథ కూడా రెడీ చేయలేదట. తర్వాత ప్రభాస్‌ సీరియస్‌గానే చెప్పాడని తెలుసుకుని షాకయ్యాడట. 'బాహుబలి తర్వాతి సినిమా నాతో ఏంటి?' అని కూడా అడిగేసాడట.

బాహుబలిని పట్టించుకోవద్దని, దానిని పూర్తిగా పక్కన పడేసి, తనతో సినిమా తీస్తే ఎలాంటి కథ రాస్తాడో అదే రాయమని ప్రభాస్‌ చెప్పాడట. అలా సుజిత్‌ 'సాహో' లైన్‌ రెడీ చేసుకుని ప్రభాస్‌కి చెబితే అతను వెంటనే ఓకే చేసాడట. అయితే ఈ చిత్రం మొదలు పెట్టినపుడు యాభై కోట్ల బడ్జెట్‌ అనుకున్నారట. కానీ తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాక సుజిత్‌ ఆలోచనలకి తగ్గట్టుగా బడ్జెట్‌ పెంచారట.

బాహుబలిని పక్కన పెట్టి ప్రభాస్‌ కోసం కథ సిద్ధం చేసినప్పటికీ, బాహుబలి తర్వాత వస్తోన్న సినిమా కనుక అంచనాలు ఎలా వుంటాయనేది తనకి తెలుసని, అందుకు ఏమాత్రం తగ్గకుండా సాహోని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తానని సుజిత్‌ అంటున్నాడు. ఏదేమైనా పాతికేళ్లు లేని యువ దర్శకుడిపై బాహుబలి భారం, నూట యాభై కోట్ల ఒత్తిడి టూమచ్‌ అని ఒప్పుకోవాల్సిందే. దీనిని జయించి అతను సాహో అనిపించుకుంటాడో లేదో చూద్దాం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English