శివగామి క్యారెక్టర్ ఆమె చేసి ఉంటే..

శివగామి క్యారెక్టర్ ఆమె చేసి ఉంటే..

‘బాహుబలి’ సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ క్యారెక్టర్లలో శివగామి ఒకటి. ‘బాహుబలి’కి కథ రాసిన విజయేంద్ర ప్రసాద్‌ ను అడిగితే.. ఈ సినిమాకు శివగామినే హీరో అంటారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ శివగామి పాత్ర గురించి మాట్లాడుకున్నవాళ్లే. ఆ పాత్రను ఇష్టపడ్డవాళ్లే. రమ్యకృష్ణను నీలాంబరిగానే గుర్తుంచుకుంటూ వచ్చిన దక్షిణాది ప్రేక్షకులు.. ‘బాహుబలి’ చూసినప్పటి నుంచి ఆమెను శివగామిగానే గుర్తిస్తున్నారు.

ఇక ఎప్పటికీ ఆమెను అలాగే గుర్తుంచుకుంటారేమో. ఐతే నిజానికి ‘బాహుబలి’ కథ సిద్ధమయ్యే సమయానికి రాజమౌళి ఆలోచనల్లో శివగామి రమ్యకృష్ణ కాదు. ఆయన ఈ పాత్రకు అనుకున్నది అతిలోక సుందరి శ్రీదేవిని. మరి రాజమౌళి అడగ్గానే శ్రీదేవి ఒప్పేసుకుని.. ఆమే ఈ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేది?

శ్రీదేవి ఒకప్పుడు అతిలోక సుందరే కావచ్చు. ఆమె మంచి నటే కావచ్చు. కానీ ఇప్పుడు ఆమె రూపం మారిపోయింది. ముఖం పీక్కుపోయి చూడ్డానికి ఇబ్బందిగా తయారైంది. పైగా శ్రీదేవికి పీల గొంతు. ఎంతమాత్రం ఫెరోషియస్‌గా అనిపించదు. శివగామి పాత్రకు సిగ్నేచర్ డైలాగ్ అయిన.. ‘‘ఇది నా మాట.. నా మాటే శాసనం’’ అనే డైలాగ్‌ ను శ్రీదేవి అని ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి.

అసలు రమ్యకృష్ణలా శ్రీదేవి రౌద్రం పలికించగలిగి ఉండేదా? రాజమాతగా రాజసం ఉట్టిపడేలా కనిపించేదా? ఎమోషనల్ సన్నివేశాల్లో అంత గొప్పగా నటించి మెప్పించగలిగి ఉండేదా? సందేహమే. శ్రీదేవి శివగామి పాత్ర చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ పేరు సంపాదించేదని వర్మ లాంటి ఆమె అభిమానులు ఫీలైతే అవ్వొచ్చు కానీ.. నిజంగా ఆ పాత్రకు ఆమె సూటయ్యేదా అంటే సందేహమే. కొన్నిసార్లు ఏం జరిగినా మన మంచికే అని సర్దుకుపోతుండాలి. శ్రీదేవి శివగామి పాత్రకు ఒప్పుకోకపోవడం కూడా అలాంటిదే అని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు