‘బాహుబలి’ని మించే సినిమా.. కేన్స్‌లో మొదలు

‘బాహుబలి’ని మించే సినిమా.. కేన్స్‌లో మొదలు

ఇండియన్ సినిమాలో ఏవైనా కొత్త ప్రయత్నాలు జరిగితే అవి తమ ఘనతే ఉండాలని భావిస్తారు కోలీవుడ్ దర్శక నిర్మాతలు. శంకర్, మణిరత్నం సహా చాలామంది తమిళ దర్శకులు తమిళ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టేశారు. వాళ్ల ప్రయత్నం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రొమ్ము విరుచుకుని నిలబడేది తమిళ సినిమా. మన తెలుగు సినిమాను వాళ్లు తక్కువగా చూసేవాళ్లు.

కానీ గత కొన్నేళ్లలో తెలుగు సినిమా అనూహ్యంగా ఎదిగిపోయింది. ముఖ్యంగా రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిపోయాడు. ‘బాహుబలి’తో తమిళ సినిమా చిన్నబోయేలా చేశాడు. ఇప్పుడు ‘బాహుబలి’ని బీట్ చేయడం తమిళ సినిమాకు పెద్ద సవాలుగా మారింది. అలాగని తమిళ దర్శకులేమీ చేతులు ముడుచుకుని కూర్చోవట్లేదు. ఓవైపు శంకర్ ‘రోబో-2’తో రాబోతుంటే.. మరోవైపు సీనియర్ దర్శకుడు సుందర్ బాహుబలి తరహా జానపద చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

సుందర్ తీయబోతున్న సినిమా పేరు ‘సంఘమిత్ర’. ఈ ప్రాజెక్టుపై సుందర్ రెండేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లోనే మొదలవుతోంది. ఐతే ప్రారంభోత్సవం దగ్గర్నుంచే సినిమాను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయడానికి ప్లాన్ చేశారు నిర్మాతలు. వచ్చే వారం ఆరంభం కానున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను లాంచ్ చేస్తుండటం విశేషం.

ఇందుకోసం దర్శక నిర్మాతలతో పాటు హీరోలు జయం రవి, ఆర్య.. హీరోయిన్ శ్రుతి హాసన్ అక్కడికి వెళ్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఇంత అని చెప్పలేదు కానీ.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేనంత బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు సుందర్ తెలిపాడు. బాహుబలి రెండు భాగాలకు కలిపి రూ.450 కోట్ల బడ్జెట్ అని నిర్మాతలు ప్రకటించగా.. ‘రోబో-2’ను రూ.400 కోట్లతో తెరకెక్కిస్తున్నాడు శంకర్. మరి ‘సంఘమిత్ర’ బడ్జెట్ వీటి కంటే ఎక్కువేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు