సంపూకి ఏడుగురు భార్య‌లు, 12 మంది పిల్ల‌లు

సంపూకి ఏడుగురు భార్య‌లు, 12 మంది పిల్ల‌లు

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త విన్యాసాలు చూసే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. న‌టుడిగా అత‌డికి లైఫ్ ఇచ్చిన ‘హృద‌య కాలేయం’ సినిమాకు ప‌ని చేసిన టీంతో క‌లిసి అత‌ను చేస్తున్న కొత్త సెటైరిక‌ల్ మూవీ ‘కొబ్బ‌రి మ‌ట్ట’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రాన్ని జూన్ తొలి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు తెస్తార‌ట‌. మంగ‌ళ‌వారం పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్న నేప‌థ్యంలో ‘కొబ్బ‌రి మ‌ట్ట’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో క‌లిసి మీడియాను క‌లిశాడు బ‌ర్నింగ్ స్టార్. ఈ సంద‌ర్భంగా కొబ్బ‌రి మ‌ట్ట గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడు సంపూ. ఈ సినిమాలో సంపూ పోషించిన పాపారాయుడు పాత్ర‌కు ఏడుగురు భార్య‌లు ఉంటార‌ని సంపూ తెలిపాడు. ఇంకా ఈ సినిమా గురించి అత‌నేమ‌న్నాడంటే..

‘‘హృద‌య కాలేయం విడుద‌లైన ద‌గ్గ‌ర్నుంచి నాకు ప్ర‌తి రోజూ పండుగే. ఆ సినిమా నాకు అంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘కొబ్బ‌రి మ‌ట్ట’ సినిమా ఆల‌స్య‌మైనా మంచి ఔట్ పుట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. ‘హృద‌య కాలేయం’ సినిమాను ఎంత ఎంజాయ్ చేశారో దాని కంటే రెట్టింపు స్థాయిలో ‘కొబ్బ‌రి మట్ట‌’ను ఎంజాయ్ చేస్తారు ప్రేక్ష‌కులు.

ఈ సినిమాలో నేను స్ఫూఫ్‌లు చేయ‌లేదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. నా పాత్ర‌కు ఏడుగురు భార్య‌లు.. ప‌న్నెండు మంది పిల్ల‌లు.. 30-40 మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు.. ఇలా చాలా పెద్ద కుటుంబం ఉంటుంది. సినిమా అంతా బోలెడంత ఎంట‌ర్టైన్మెంట్ ఉంటుంది. డైలాగులు అదిరిపోతాయి’’ అని సంపూ చెప్పాడు. తాను ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ రోల్స్ చేయ‌ట్లేదని.. సోలో హీరోగా ఇంకో రెండు సినిమాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని సంపూ వెల్ల‌డించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు