ఓవైపు బాహుబలి.. మరోవైపు దంగల్

ఓవైపు బాహుబలి.. మరోవైపు దంగల్

పది రోజుల నుంచి భారతీయ సినీ పరిశ్రమ మొత్తం 'బాహుబలి: ది కంక్లూజన్' గురించే మాట్లాడుకుంటోంది. ఈ సినిమా కురిపిస్తున్న వసూళ్ల వర్షం చూసి అబ్బుర పడుతోంది. ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 'బాహుబలి-2' ప్రభంజనం సాగిస్తోంది. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ సినిమా కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తోంది.

ఐతే ఓవైపు బాహుబలి-2 హవా కొనసాగుతుండగానే.. మరో ఇండియన్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ 'దంగల్' చైనాలో 9 వేలకు పైగా థియేటర్లలో ఈ శుక్రవారమే విడుదలైంది. చైనాలో రిలీజైన కొత్త సినిమాలకు దీటుగా 'దంగల్' ఓపెనింగ్స్ సాధించడం విశేషం.

ఈ వారాంతంలో చైనా బాక్సాఫీస్ లో 'దంగల్' టాప్-2లో ఉండటం విశేషం. తొలి రోజే 2.05 మిలియన్ డాలర్లు (రూ.13.19 కోట్లు) వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టింది. 2.08 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. అక్కడ రెండు రోజుల్లోనే 'దంగల్' వసూళ్లు రూ.40 కోట్లు దాటిపోయాయి. 'పీకే' తర్వాత మరోసారి అమీర్ చైనాలో రూ.100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అమెరికా.. బ్రిటన్ లాంటి పెద్ద దేశాల్లో ఓవైపు 'బాహుబలి' హవా సాగిస్తుంటే.. చైనాలో 'దంగల్' ఆధిపత్యం చలాయిస్తోంది. మొత్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియన్ సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం.. వార్తల్లో నిలవడం అరుదైన విషయం. ఐతే 'బాహుబలి: ది బిగినింగ్'కు చైనాలో ఆశించిన ఆదరణ లభించని నేపథ్యంలో 'బాహుబలి: ది కంక్లూజన్' అక్కడ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. అక్కడ త్వరలోనే 'బాహుబలి-2'ను రిలీజ్ చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు