విజయేంద్ర ప్రసాద్ కథను పక్కన పెట్టేశాడు

విజయేంద్ర ప్రసాద్ కథను పక్కన పెట్టేశాడు

విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ రైటర్ ఈయనే అంటే అతిశయోక్తి ఏమీ కాదు. 'బాహుబలి' సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాకు పని చేస్తూనే బాలీవుడ్లో 'భజరంగి భాయిజాన్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి స్క్రిప్టు అందించాడాయన.

హిందీ వాళ్లే కాదు.. కన్నడ, తమిళ ఇండస్ట్రీల జనాలు సైతం ఆయన వెంటపడుతున్నారు. కన్నడలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా పరిచయమైన 'జాగ్వార్' సినిమాకు కథ అందించింది ఆయనే. అలాగే తమిళంలో విజయ్ కొత్త సినిమాకు స్క్రిప్టు రాసిందీ ఆయనే. ఇప్పుడు క్రిష్ కోసం 'మణికర్ణిక' స్క్రిప్టు రాసి పెట్టాడు. మొత్తంగా ఆయన డిమాండ్ మామూలుగా లేదిప్పుడు.

ఇంత డిమాండ్ ఉన్న రైటర్ రాసిచ్చిన స్క్రిప్టును పక్కన పడేశాడు బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్. 'భజరంగి భాయిజాన్' సినిమా చూసి ఫిదా అయిపోయిన సన్నీ.. విజయేంద్ర ప్రసాద్‌తో 'మేరా భారత్ మహాన్' అనే సినిమాకు కథ రాయించుకున్నాడు. 'గదర్ ఏక్ ప్రేమ్ కథ' తరహాలో దేశభక్తి నేపథ్యంలో సాగే కథ ఇది. స్క్రిప్టు రెడీ అయింది. ఇక సినిమా చేయడమే తరువాయి అనుకుంటుంటే.. ఆ సినిమా నుంచి సన్నీ వైదొలిగాడు. ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది.

తన కొడుకు కరణ్‌ను హీరోగా పరిచయం చేయడానికే సన్నీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. కొడుకును హీరోగా పెట్టి 'పల్ పల్ దిల్ కే పాస్' అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో మొదలుపెడుతున్నాడు సన్నీ. అందుకోసమే విజయేంద్ర కథతో చేయాల్సిన సినిమాను పక్కనబెట్టేశాడు. ఈ సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు. మరి సన్నీని దృష్టిలో ఉంచుకుని రాసిన కథను విజయేంద్ర మరో హీరోకు తగ్గట్లు మార్చి అది పట్టాలెక్కేట్లు చేస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు