తెలుగు లిరిసిస్టుతో హిందీలో రాయించిన వర్మ

తెలుగు లిరిసిస్టుతో హిందీలో రాయించిన వర్మ

రామ్ గోపాల్ వర్మకు ఎవరైనా టెక్నీషియన్‌తో కనెక్టయిందంటే వాళ్లను అంత సులువుగా వదులుకోడని అంటారు. అందుకే ఆయన సినిమాల్లో రెగ్యులర్‌గా ఒకే టెక్నికల్ టీం పని చేస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లలో రామ్ గోపాల్ వర్మ తెలుగులో తీసిన సినిమాలన్నింటికీ లిరిసిస్టు ఒక్కరే. అతనే... సిరాశ్రీ. జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత పాటల రచయితగా మారాడు సిరాశ్రీ.

వర్మ మీద 'వోడ్కా విత్ వర్మ' అనే పుస్తకం కూడా రాసి.. ఆయనకు బాగా చేరువయ్యాడతను. వర్మ సినిమాలతోనే అతడికి పేరొచ్చింది. వరుసగా ఆయన సినిమాలన్నింటికీ తనే పాటలు రాస్తూ వస్తున్నాడు. వర్మ చివరగా తీసిన 'వంగవీటి'లోనూ పాటలన్నీ రాసింది సిరాశ్రీనే.

ఇప్పుడీ రచయితతో ఏకంగా హిందీ పాటే రాయించేశాడు రామ్ గోపాల్ వర్మ. అది కూడా అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'సర్కార్-3' సినిమా కోసం కావడం విశేషం. ఇందులో తంబా.. అంటూ సాగే పాటను సిరాశ్రీ రాశాడు. ఓ తెలుగు రచయిత ఇలా హిందీలో పాట రాయడం అరుదైన విషయమే. ఈ చిత్రానికి వర్మ ఆస్థాన సంగీత దర్శకుడు రవిశంకర్ మ్యూజిక్ ఇచ్చాడు.

మార్చిలోనే రావాల్సిన 'సర్కార్-3' రెండు మూడు సార్లు వాయిదా పడి మే 12కు షెడ్యూల్ అయింది. సర్కార్ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల మాదిరి దీనికి అంత పాజిటివ్ బజ్ లేదు. అమితాబ్ కథానాయకుడిగా నటించినప్పటికీ దీనిపై అంత హైప్ క్రియేటవ్వలేదు. గత కొన్నేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉండటమే ఇందుకు కారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు