బాహుబలి టీవీ సిరీస్.. నిర్మాత ట్విస్టు

బాహుబలి టీవీ సిరీస్.. నిర్మాత ట్విస్టు

సినిమాగా 'బాహుబలి'కి తెరపడిందేమో కానీ.. బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని ఈ చిత్ర నిర్మాతలు ముందే ప్రకటించారు. 'బాహుబలి' క్యారెక్టర్లతో పుస్తకాలని.. వీఆర్ వీడియోలని.. కామిక్స్ అని.. టీవీ సిరీస్ అని.. వెబ్ సిరీస్ అని రకరకాలుగా 'బాహుబలి' ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇందులో కొన్ని పనులు ఇప్పటికే మొదలై విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఐతే వీటిలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది టీవీ సిరీసే. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో బాహుబలి టీవీ సిరీస్ ను కూడా ఇండియాలో ఒక బ్రాండ్ గా మార్చాలని.. ప్రేక్షకుల్ని అలరించాలని బాహుబలి టీం భావిస్తోంది.

ఐతే 'బాహుబలి' సినిమా తరహాలో దీన్ని బేసిగ్గా తెలుగులో తీయరట. 'బాహుబలి' టీవీ సిరీస్ హిందీలో తెరకెక్కుతుందంటూ ట్విస్టు ఇచ్చాడు నిర్మాత శోభు యార్లగడ్డ. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అవుతోందని.. త్వరలోనే టీవీ సిరీస్ చిత్రీకరణ మొదలవుతుందని ఆయన చెప్పారు. 'బాహుబలి' ఇండియన్ సినిమాగా మారిందని.. దేశం నలుమూలలా దీనికి అభిమానులు ఏర్పడ్డారని.. కాబట్టి ఎక్కువమందికి రీచ్ అయ్యేందుకు ముందు హిందీలో తీసి.. తర్వాత తెలుగు సహా మిగతా భాషల్లోకి డబ్ చేస్తామిన ఆయన అన్నారు. హిందీలో తీసి.. తెలుగులోకి డబ్ చేస్తే కచ్చితంగా అది 'ఒరిజినల్' ఫీలింగ్ ఇవ్వదు.

డబ్బింగ్ సీరియల్ చూసిన ఫీలింగే కలుగుతుంది. 'బాహుబలి' ప్రస్థానం ఆరంభమైంది తెలుగు నుంచి. దానికి పేరొచ్చిందే ఇక్కడి నుంచి. అలాంటపుడు టీవీ సిరీస్ కూడా తెలుగులోనే మొదలుపెడితే బాగుండేది. మన ప్రేక్షకుల్ని గౌరవించినట్లుండేది. కానీ హిందీలో మొదలుపెడితే మన వాళ్లు దాన్నెంత మాత్రం ఓన్ చేసుకుంటారన్నది సందేహం. ఈ టీవీ సిరీస్ కోసం రామోజీ ఫిలిం సిటీలో వేసిన మాహిష్మతి సెట్టింగ్స్‌ను అలాగే లీజుకు తీసుకుని ఉపయోగించుకోబోతున్నారట నిర్మాతలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు