కోన సార్.. అతడి ట్రాప్‌లో పడ్డారేంటి?

కోన సార్.. అతడి ట్రాప్‌లో పడ్డారేంటి?

సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఎవరినో ఒకరిని తిట్టాలి. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయాలి. అక్కడ జనాల దృష్టిని ఆకర్షించేది చెడే. సాత్వికంగా ఉంటూ.. పద్ధతిగా మాట్లాడుతుంటే అక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరినో ఒకరిని కెలుకుతూ.. హద్దులు దాటి మాట్లాడితే జనాల దృష్టిని ఆకర్షించవచ్చు. ఫాలోవర్లను పెంచుకోవచ్చు. ఈ కిటుకు బాగా తెలిసిన వాడు పెద్ద క్రిటిక్ అనే చెప్పుకునే అనాకారీ కమల్ ఆర్.ఖాన్. బాలీవుడ్లో 'దేశ్ ద్రోహి' అనే సి-గ్రేడ్ సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేసిన కమల్.. ఆ తర్వాత క్రిటిక్ అవతారం ఎత్తాడు.

బాలీవుడ్ సినిమాల మీద పిచ్చి రివ్యూలిస్తూ.. అక్కడి సెలబ్రెటీల మీద ఎప్పుడూ అవాకులు చెవాకులు పేలుతూ.. సోషల్ మీడియాలో కొంచెం పాపులారిటీ సంపాదించాడు. అతడినో పిచ్చివాడిగా జమకట్టి బాలీవుడ్ జనాలు పట్టించుకోవడం మానేశారు. కానీ ఈ మధ్య ట్విట్టర్లో ఫాలోవర్లు పెరిగేసరికి మీడియాలో హైలైట్ అయిపోతున్నాడు. బాగా పేరున్న హీరోను తిట్టడం.. ఆ హీరో అభిమానులు తన మీదికి దాడికి దిగితే.. దాన్ని పబ్లిసిటీకి వాడుకోవడం.. ఇదీ ఇతగాడి తీరు. పవన్ కళ్యాణ్, మోహన్ లాల్‌ల లాంటి సౌత్ స్టార్లను కించపరిచేలా మాట్లాడి.. ఇలాగే పబ్లిసిటీ తెచ్చుకున్నాడు.

ఇప్పుడు దేశమంతా బాహుబలి-2 మాయలో మునిగిపోయి ఉండగా.. ఆ సినిమాను తిట్టిపోస్తున్నాడు. దీని గురించి ఓ చెత్త రివ్యూ ఇచ్చాడు. రాజమౌళి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రభాస్, రానాలను టార్గెట్ చేస్తూ తాజాగా ఒక ట్వీట్ పెట్టాడు. వాళ్లిద్దరి కంటే తనకే ట్విట్టర్లో ఎక్కువ ఫాలోవర్లున్నారని అంటూ మన హీరోల్ని 'లుక్కాస్' అన్నాడు కమల్. దాని మీద టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్‌కు కోపం వచ్చింది.

''నువ్వు టెర్రరిస్టు కంటే ఘోరం అని.. నీ స్టుపిడిటీని రాజమౌళి, ప్రభాస్, రానాలతో పాటు నీ తల్లి క్షమించాలి'' అంటూ ఆగ్రహం చూపించాడు. ఐతే తన గురించి సెలబ్రెటీలు స్పందిస్తే.. దాన్ని పబ్లిసిటీకి వాడుకోవాలని చూసే కమల్‌కు ఇలాంటి రెస్పాన్సే కావాలి. ఇది అతను వేసే ట్రాప్. స్థాయి లేని ఇలాంటి వాడిని ఇగ్నోర్ చేయడమే మంచిది. అలా కాకుండా అతడి ట్వీట్లకు స్పందిస్తే.. ట్రాప్‌లో పడ్డట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English