బాహుబలి డైలాగ్స్.. క్రెడిట్ ఏదీ?

బాహుబలి డైలాగ్స్.. క్రెడిట్ ఏదీ?

'బాహుబలి: ది బిగినింగ్' దగ్గర్నుంచి ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లలో చాలామందికి మీడియాలో మంచి ప్రచారమే లభించింది. దర్శకుడు రాజమౌళి ఎంత గొప్ పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి, కథకుడు విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, వీఎఫెక్స్ సూపర్ వైజర్లు శ్రీనివాస మోహన్, కమల్ కణ్ణన్.. ఇలా ప్రతి ఒక్కరికీ దక్కాల్సిన క్రెడిట్ దక్కింది.

చిత్ర బృందమూ వీళ్లకు మంచి ప్రయారిటీ ఇచ్చింది. అలాగే మీడియాలో కూడా వీరికి దక్కాల్సిన ప్రాధాన్యం దక్కింది. కానీ 'బాహుబలి'కి మాటలు రాసిన రచయితలకు మాత్రం రావాల్సిన పేరు రాలేదు. అసలు ఈ చిత్రానికి మాటలు రాసిందెవరన్నది కూడా జనాలకు తెలియదు.

'బాహుబలి'కి మాటలు రాసిన రచయితల పేర్లు అజయ్ కుమార్, విజయ్ కుమార్. ఎప్పుడూ కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ గురించి అందరూ మాట్లాడతారు కానీ.. మాటలు వేరే రాసింది వేరే రచయితలు అన్న మాటే తెరమీదికి రాదు. ఇప్పటిదాకా రాజమౌళి కానీ.. మరొకరు కానీ ఈ అజయ్, విజయ్‌ల గురించి మాట్లాడింది లేదు. వీళ్లెవ్వరన్నది తెలియదు.

ఇప్పటిదాకా మీడియాకు కూడా వీళ్లు పరిచయం కాలేదు. ఈ సినిమా ప్రమోషన్లలోనూ వాళ్లు కనిపించలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్ లాంటి దాంట్లో పాల్గొన్నారో ఏమో కానీ.. వేదిక మీదికైతే వచ్చినట్లు లేరు. 'బాహుబలి: ది కంక్లూజన్' టైటిల్ కార్డ్స్‌లో అసలు వీళ్ల పేర్లు కూడా పడ్డట్లు లేవు. గత ఏడాది రైటర్ డైమండ్ రత్నబాబు ఒక ఇంటర్వ్యూలో దీని గురించే ప్రస్తావించాడు. రచయితలకు సరైన గుర్తింపు దక్కట్లేదని.. బాహుబలికి మాటలు రాసిన అజయ్, విజయ్‌ల గురించి జనాలకు తెలుసా అని ప్రశ్నించాడు. అప్పుడతను అలా నిలదీయడంలో తప్పేమీ లేదనే అనిపిస్తోంది 'బాహుబలి' టీం ఈ రైటర్లకు ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు