బాహుబలి బడ్జెట్ 450 కోట్లు.. నిజమేనా?

బాహుబలి బడ్జెట్ 450 కోట్లు.. నిజమేనా?

'బాహుబలి' సినిమా మొదలైనపుడు దాని బడ్జెట్ రూ.150 కోట్లన్నారు. కానీ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలనుకున్నాక బడ్జెట్ రూ.250 కోట్లకు పెంచినట్లుగా చెప్పారు. కానీ 'బాహుబలి: ది కంక్లూజన్' విడుదలకు సిద్ధమైన సమయంలో ముంబయిలో జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. బడ్జెట్ ఏకంగా రూ.450 కోట్లని చెప్పాడు.

బాహుబలి రెండో భాగానికి సంబంధించి ముందే 40 శాతం షూటింగ్ పూర్తి చేసేసిన నేపథ్యంలో మిగతా 60 శాతం తీయడానికి అంత బడ్జెట్ పెట్టేశారా.. ఒక్కసారిగా బడ్జెట్ ఈ స్థాయిలో ఎందుకు పెరిగిపోయింది.. అన్న సందేహాలు జనాల్ని వెంటాడాయి. నిర్మాతలు కావాలనే బడ్జెట్ ఎక్కువ చేసి చెప్పుకుంటున్నారని సందేహించారు.

ఐతే బాహుబలి బడ్జెట్ రూ.450 కోట్లకు ఎందుకు పెరిగిందన్నదానికి యూనిట్ సభ్యులు కారణం చెబుతున్నారు. బడ్జెట్ అంతే కేవలం సినిమాకు ఖర్చు పెట్టేది మాత్రమే కాదని.. పారితోషకాలు కూడా దాని కిందకే వస్తాయని.. అలా చూసుకుంటే సగానికి పైగా బడ్జెట్ పారితోషకాల రూపంలో వెళ్లిందని అంటున్నారు. 'బాహుబలి-1' తిరుగులేని విజయం సాధించాక.. రెండో భాగానికి భారీ స్థాయిలో బిజినెస్ చేశాక.. ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో కష్టపడిన వాళ్లందరికీ అదనంగా పారితోషకాలు ఇవ్వాలని నిర్ణయించారట. అందులో భాగంగానే ప్రభాస్ పారితోషకానికి సంబంధించి ఇంతకుముందు అనుకున్న అగ్రిమెంట్‌ను పక్కనబెట్టేసి రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.75 కోట్ల దాకా అతడికి రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఇలాగే సినిమాలో పాత్రధారులైన అందరికీ పారితోషకాలు భారీ స్థాయిలో అందజేయాలని డిసైడయ్యారు. రాజమౌళితో పాటు ఈ సినిమాలో భాగస్వాములైన తన కుటుంబం మొత్తానికి కూడా భారీ పారితోషకాలు ముట్టాయట. ఈ లెక్కలన్నీ కలుపుకునే బడ్జెట్ రూ.450 కోట్లు అని శోభు చెప్పాడని అంటున్నాయి బాహుబలి యూనిట్ వర్గాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు