ఆ సినిమాకి రిపేర్ల మీద రిపేర్లు

ఆ సినిమాకి రిపేర్ల మీద రిపేర్లు

రాంగోపాల్‌వర్మ 'సర్కార్‌'కి మరో సీక్వెల్‌ తీస్తున్నాడంటే పదేళ్ల క్రితమైతే ఎక్సయిటింగ్‌గా అనిపించి వుండేదేమో కానీ ఇప్పుడు అది ఏ విధంగాను ఎక్సయిట్‌ చేయడం లేదు. ఈమధ్య కాలంలో వర్మ తీసిన సినిమాల వల్ల అతడి నుంచి అద్భుతాలని ఎవరూ ఆశించడం లేదు. అమితాబ్‌ బచ్చన్‌ వున్నాడన్నా కానీ నమ్మకం కలగట్లేదు.

వర్మ తీసిన చిత్రాల్లో భారీ విమర్శలకి గురయిన 'ఆగ్‌'లో కూడా అమితాబ్‌ వున్నాడు కనుక ఆయన ప్రెజెన్స్‌ ఒక్కటీ 'సర్కార్‌ 3'కి క్రేజ్‌ తీసుకు రాలేదు. ఇకపోతే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదా పడుతూ పోతోంది.

ఇంతకీ దీనికి కారణం ఏమిటంటే దీనికి చాలా రిపేర్లు జరుగుతున్నాయట. ఎంతకీ సంతృప్తికరమైన అవుట్‌పుట్‌ రాకపోయేసరికి దీనిని అమితాబ్‌ ఏర్పరచిన ఒక కమిటీకి చూపించి అభిప్రాయమడిగారట. వారు ఈ చిత్రం లెంగ్త్‌ మరీ ఎక్కువైందని, తగ్గించాలని సూచిస్తే, అందుకు అనుగుణంగా రీ ఎడిట్లు చాలానే చేసారట.

ఇదంతా నిజమే అయితే కనుక ఎక్కడి వర్మ ఎక్కడికి వచ్చాడనుకోవాల్సిందే. ఒకప్పుడు తను తీసిందే సినిమా అని, నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి అన్న వర్మ ఇప్పుడు తన చిత్రాన్ని వేరొకరికి చూపించి, వారి అభిప్రాయాలకి అనుగుణంగా మార్పులు చేయడమంటే చిన్న విషయం కాదుగా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు