ఎవరన్నారు రాజమౌళికి గర్వం లేదని?

ఎవరన్నారు రాజమౌళికి గర్వం లేదని?

ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలంటారు పెద్దోళ్లు. కానీ సినిమా పరిశ్రమలో కొంచెం పేరు రాగానే మిడిసిపడే వాళ్లకు కొదవే ఉండదు. హీరోలే కాదు.. దర్శకుల్లోనూ చాలామంది ఒకట్రెండు సక్సెస్‌లకే పొగరు తలకెక్కించుకుంటూ ఉంటారు. ఐతే ఇలాంటి వాళ్లు రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

కెరీర్లో ఇప్పటిదాకా అపజయం అన్నదే లేకపోవడమే కాదు.. సినిమా సినిమాకూ తన స్థాయి అమాంతం పెరిగిపోతున్నా.. ఎప్పుడూ పొగరు తలకెక్కించుకున్నట్లుగా కనిపించడు రాజమౌళి. చాలా ఒద్దికగా ఉంటాడు. పద్ధతిగా మాట్లాడతాడు. రాజమౌళికి గర్వం లేదన్న విషయాన్ని ఆయన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా ఒప్పుకునే విషయమే. కానీ రాజమౌళి భార్య రమ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. రాజమౌళికి గర్వం లేదని ఎవరన్నారు అని ఆమె ప్రశ్నిస్తోంది.

"రాజమౌళికి కూడా గర్వం ఉంటుంది. ఆయనేమీ గౌతమ బుద్దుడు కాడు. సెయింట్‌ అసలే కాదు. ఇంత పెద్ద సక్సెస్‌ సాధించిన తర్వాత చిన్నపాటి గర్వం లేకుండా ఎలా ఉంటుంది? ఉంటుంది కానీ.. దాన్ని పైకి చూపించడు. రాజమౌళి సక్సెస్‌ చూసి.. నాకు, మా కుటుంబానికి కూడా చాలా గర్వంగా ఉంటుంది" అని రమ తెలిపింది. ఇక ఒక హిట్టయ్యాక తర్వాతి సినిమా కూడా హిట్టు కొట్టాలనే ఒత్తిడిని రాజమౌళి కూడా అనుభవిస్తాడని.. కానీ పనిలో పడే ఆ ఒత్తిడిని తగ్గించుకుంటాడని.. అతడితో పోలిస్తే తనకే ఎక్కువ టెన్షన్ ఉంటుందని రమ తెలిపింది.

నేను రాజమౌళి ప్రతి సినిమాకీ ఆందోళన చెందుతుంటాను. బాహుబలి-2కు ముందు కూడా టెన్షన్‌లో ఉన్నాను. నా భయాన్ని మాటల్లో చెప్పలేను. కడుపు మెలి తిప్పిన ఫీలింగ్‌. రాజమౌళికి టెన్షన్ ఉంటుంది కానీ.. అతడి మెదడుకు ఖాళీయే ఉండదు. షూటింగ్‌ చేస్తాడు. ఫుల్‌గా అలసిపోతాడు. హాయిగా నిద్రపోతాడు. అస్సలు భయపడడని కాదు, ఉంటుంది. కానీ నాకున్నంత భయం ఆయనకు ఉండదు" అని రమ చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు