ఫ్లాప్ అయినా త‌మ‌న్నా త‌గ్గ‌ట్లేదు


ఒక‌ప్ప‌ట్లా సినిమాలు ఎక్కువ‌, వెబ్ వెబ్ సిరీస్‌లు త‌క్కువ అనే అభిప్రాయం న‌టుల్లో ఇప్పుడు లేదు. ముఖ్యంగా ఈ విష‌యంలో హీరోయిన్ల ఆలోచ‌న ధోర‌ణి మారిపోయింది. భ‌విష్య‌త్ అంతా డిజిట‌ల్ మీడియందే అని అర్థం చేసుకుని సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాక కూడా కెరీర్‌ను కొన‌సాగించేలా వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్, త‌మ‌న్నా, స‌మంత లాంటి అగ్ర క‌థానాయ‌కులు ఇప్ప‌టికే వెబ్ సిరీస్‌లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజ‌ల్ న‌టించిన లైవ్ టెలికాస్ట్, త‌మ‌న్నా చేసిన లెవంత్ అవ‌ర్ విడుద‌ల‌య్యాయి. కానీ వాటికి ఆశించిన స్పంద‌న రాలేదు.

ముఖ్యంగా త‌మ‌న్నా లెవంత్ అవ‌ర్ గురించి చేసిన ప్ర‌చారానికి త‌గ్గట్లు కంటెంట్ లేక‌పోయింది. ఆహాలో ఇటీవ‌లే విడుద‌లైన ఈ సిరీస్‌కు యావ‌రేజ్ రివ్యూలు వ‌చ్చాయి. వెబ్ సిరీస్‌లంటేనే లెంగ్త్ ఎక్కువ కాబ‌ట్టి సిరీస్ చాలా బాగుంద‌ని టాక్ వ‌స్తే త‌ప్ప ఆద‌ర‌ణ ఉండ‌దు. ఈ విష‌యంలో లెవంత్ అవ‌ర్ నిరాశ ప‌ర‌చ‌డంతో ఆశించిన స్పంద‌న లేక‌పోయింది. డిజిట‌ల్ మీడియంలో తొలి అడుగు త‌డ‌బ‌డ్డ‌ప్ప‌టికీ త‌మ‌న్నా ఏమీ త‌గ్గ‌ట్లేద‌ని స‌మాచారం. త‌న‌ను లాంచ్ చేసిన ఆహాతోనే కంటిన్యూ కాబోతోంద‌ట.

ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం త‌మ‌న్నా మ‌రో వెబ్ సిరీస్ చేయ‌నుంద‌ట‌. ఓ యువ ద‌ర్శ‌కుడు దీన్ని డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయని.. త్వ‌ర‌లోనే సిరీస్ సెట్స్ మీదికి వెళ్తుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు ఆహా కోసం ఒక వెరైటీ టాక్ షో కూడా చేయ‌బోతోంద‌ట త‌మ‌న్నా. ఇప్ప‌టికే స‌మంత‌, రానాల టాక్ షోలు ఇందులో ప్ర‌సారం అవుతున్నాయి. వాటికి భిన్న‌మైన కాన్సెప్ట్‌తో షో ప్లాన్ చేస్తున్నార‌ని.. త‌మ‌న్నా దీన్ని హోస్ట్ చేయ‌డానికి అంగీక‌రించింద‌ని స‌మాచారం. చూస్తుంటే సినిమా అవ‌కాశాలు ఏమైనప్ప‌టికీ మున్ముందు త‌మ‌న్నా కెరీర్‌కు ఢోకా లేన‌ట్లే క‌నిపిస్తోంది.