కృష్ణ‌వంశీ అత‌డి మీదే భారం వేసేశాడు

కృష్ణ‌వంశీ అత‌డి మీదే భారం వేసేశాడు

ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా ఒక వెలుగు వెలిగిన కృష్ణ‌వంశీకి చాలా ఏళ్ల నుంచి కాలం క‌లిసి రావ‌ట్లేదు. అప్ప‌ట్లో కృష్ణ‌వంశీతో ఓ సినిమా అయినా చేయాల‌ని స్టార్ హీరోలు త‌హ‌త‌హ‌లాడేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయ‌న పేరు చెబితే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి. గ‌త ద‌శాబ్ద కాలంలో కృష్ణ‌వంశీ నుంచి అలాంటి సినిమాలొచ్చాయి మ‌రి. ఆయ‌న నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన‌ ‘గోవిందుడు అందరివాడే’ కూడా అంతగా ఆడలేదు. కాక‌పోతే కృష్ణవంశీ అంతకు ముందు తీసిన సినిమాల్లాగా డిజాస్టర్ అయితే కాలేదు. దీంతో ఆయన కొంచెం కోలుకుని సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ అనే క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. ఈ సినిమా మొద‌లైన‌పుడు జ‌నాల్లో బాగానే ఆస‌క్తి ఉంది. మొద‌ట్లో ప్ర‌మోష‌న్ హ‌డావుడి కూడా బాగానే క‌నిపించింది. కానీ త‌ర్వాత నెమ్మ‌దిగా ఈ చిత్రం వార్త‌ల్లోంచి ప‌క్క‌కు వెళ్లిపోయింది.

సినిమా డిలే కావ‌డం.. కృష్ణ‌వంశీతో పాటు హీరో సందీప్ కిష‌న్ ట్రాక్ రికార్డు పేల‌వంగా ఉండ‌టంతో ‘న‌క్ష‌త్రం’పై ఇప్పుడేమంత హైప్ లేదు. ఐతే ఇందులో ప్ర‌త్యేక పాత్ర పోషిస్తున్న సాయిధ‌రమ్ తేజ్ మీదే ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆశ‌ల‌న్నీ నిలిచి ఉన్నాయి. ముందు ఈ సినిమాలో తేజుది 20 నిమిషాల గెస్ట్ రోల్ అన్నారు. కానీ ఇప్పుడ‌ది 40 నిమిషాల‌కు పెరిగింద‌ట‌. అంతే కాదు.. ఇప్పుడు అత‌డి కోసం ఓ స్పెష‌ల్ సాంగ్ కూడా ప్లేస్ చేశాడ‌ట కృష్ణ‌వంశీ. ప్ర‌స్తుతం ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ పాట చాలా ప్ర‌త్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడ‌ట‌. ‘అంత:పురం’లో జగపతిబాబు పాత్ర లాగా తేజుది చాలా స్పెషల్ అంటున్నారు. ఈ పాత్రే సినిమాకు జీవం అని కూడా చెబుతున్నారు. తేజును ముందు పెట్టి  సినిమాను ప్రమోట్ చేస్తే మళ్లీ హైప్ తీసుకురావచ్చని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఐతే ‘తిక్క‌’.. ‘విన్న‌ర్’ లాంటి ఫ్లాపుల‌తో తేజు కూడా ట్రాక్ త‌ప్ప‌డ‌మే క‌ల‌వ‌ర‌పెడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు