బాహుబలి-2లో ఆ ఫ్యామిలీ వాళ్లే 15 మంది

బాహుబలి-2లో ఆ ఫ్యామిలీ వాళ్లే 15 మంది

రాజమౌళితో సినిమా అంటే.. అదో ఫ్యామిలీ ప్యాకేజీనే అంటారు ఇండస్ట్రీలో. రాజమౌళి దర్శకత్వం వహిస్తే.. కథ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తాడు. సంగీత బాధ్యతలు రాజమౌళి అన్నయ్య కీరవాణి చూసుకుంటాడు. ఇక రాజమౌళి భార్య రమ స్టైలింగ్ చేస్తుంది.

ఐతే ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయమే. ఐతే 'బాహుబలి' విషయానికి వస్తే.. ఆ ఫ్యామిలీకి చెందిన మరింత మంది ఈ సినిమాలో భాగస్వాములయ్యారు. ఆ లెక్క మొత్తం తీస్తే 15కు చేరడం విశేషం. అవును.. 'బాహుబలి'లో రాజమౌళి ఫ్యామిలీకి చెందిన 15 మంది భాగస్వామ్యం ఉంది.

రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్.. కీరవాణి.. రమ.. వీళ్ల సంగతి వదిలేస్తే.. కీరవాణి తండ్రి శివశక్తి దత్తాతో పాటు ఆయన తమ్ముడు రామకృష్ణ ఇందులో పాటలు రాశారు. కీరవాణి తమ్ముడైన మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి కోడూరి సౌండ్‌ మిక్సింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. కీరవాణి సతీమణి వల్లి ఎప్పట్లాగే లైన్‌ ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరించింది. రాజమౌళి కొడుకు కార్తికేయ సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌‌గానే కాక అనేక బాధ్యతలు నిర్వర్తించాడు.

కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఈ సినిమాలో రెండు పాటలు పాడాడు. కీరవాణి రెండో కొడుకు శ్రీసింహా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. రామకృష్ణ కొడుకు రాజబలి వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో చేశాడు. కల్యాణి కోడూరి కొడుకు మయూర్‌ ఒక బిట్‌‌కు ఇందులో డబ్బింగ్‌ చెప్పాడు. వీళ్లే కాక రాజమౌళి కూతురు మయూఖ.. కీరవాణి తనయురాలు కుముద్వతి సాహోరే బాహుబలి పాటలో కనిపించారు. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాల వాళ్లు 'బాహుబలి' కోసం పని చేయడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు