వంద కోట్ల బడ్జెట్.. ఉత్తిదే అంటున్నాడు

వంద కోట్ల బడ్జెట్.. ఉత్తిదే అంటున్నాడు

గత కొన్నేళ్లలో తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. బడ్జెట్లు పెరిగాయి. వసూళ్లు పెరిగాయి. ఒకప్పుడు రూ.50 కోట్ల బడ్జెట్‌కే ఔరా అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలంటే రూ.70-80 కోట్ల బడ్జెట్ లేనిదే వర్కవుటయ్యేలా లేదు. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో సినిమాలు తీయాలంటే నిర్మాత దగ్గర మినిమం రూ.100 కోట్లుండాల్సిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వీళ్లిద్దరి సినిమాలూ ఆ రేంజి బడ్జెట్లోనే తెరకెక్కుతున్నాయి.

ఐతే ఈ 100 కోట్లూ సినిమా కోసమే ఖర్చు పెట్టాస్తారా అంటే అదేమీ కాదు. అందులో కనీసం సగం కూడా సినిమాకు పెట్టేదేం ఉండదు. అసలు ఈ వంద కోట్ల లెక్కేంటో.. ఇందులో దేనికెంత పోతుందో.. సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివరిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయనేమంటున్నారంటే..

''తెలుగు సినిమాలు వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్నాయని సంబరపడిపోతున్నాం. కానీ నిజానికి అదంతా ఉత్తిదే. మామూలుగా సినిమాల బడ్జెట్లో పారితోషకాలు 30 శాతానికి మించకూడదు. కానీ మన దగ్గర 70 శాతం పారితోషకాలకే పోతోంది. ఇప్పుడు చెబుతున్న వంద కోట్ల సినిమాల్లో కూడా 60-70 కోట్లు రెమ్యూనరేషన్లకే ఇచ్చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని కూడా కేవలం సినిమాకే ఖర్చు పెట్టట్లేదు. 40-50 రోజుల్లో ముగించాల్సిన సినిమాను వంద రోజులకు పైగా తీస్తున్నారు. దీని ద్వారా ఓ 20 కోట్లయినా వృథా అవుతోంది. తీరా చూస్తే ఓ పది శాతం కూడా సినిమాకు ఖర్చు పెట్టట్లేదు. ఇలాంటి వాటిని వంద కోట్ల బడ్జెట్ సినిమాలుగా ఎలా చెబుతాం.

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాల్లో కేవలం సినిమా కోసమే ఎక్కువ ఖర్చు పెట్టిందంటే ఒక్క బాహుబలికి మాత్రమే. ఐతే తక్కువ ఖర్చులో పూర్తయి.. డబ్బులకు డబ్బులు, అవార్డులకు అవార్డులు తెచ్చిన సినిమాలున్నాయి. శతమానం భవతి, పెళ్లిచూపులు అందుకు ఉదాహరణ. ఈ వంద కోట్ల బడ్జెట్లో 'శతమానం..' లాంటి సినిమాలు పది తీయొచ్చు. 'పెళ్లిచూపులు' లాంటి సినిమాలు 40-50 తీయొచ్చు. జనాలు అయ్యో వంద కోట్లు పెట్టారే అని భారీ సినిమాలపై జాలిపడి చూడాల్సిన పని లేదు. చిన్న సినిమాలకే ప్రోత్సాహం అందిస్తే అలాంటివి మరిన్ని వస్తాయి'' అని తమ్మారెడ్డి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు