2.0 వాయిదా పడటానికి బాహుబలి కారణమా?

2.0 వాయిదా పడటానికి బాహుబలి కారణమా?

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తూ రోబో సీక్వెల్ '2.0'ను ఈ ఏడాది దీపావళి సీజన్ నుంచి వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్‌కు వాయిదా వేసేశారు నిర్మాతలు. దీనికి వాళ్లు చెప్పిన కారణం.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడంలో ఆలస్యం అవుతుండటమేనట. ఐతే తొంభైల నుంచే విజువల్ ఎఫెక్ట్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ వస్తూ.. ఈ విషయంలో తనకు సాటి రాగల దర్శకుడు వేరెవ్వరూ లేరని చాటుకున్న శంకర్.. ఇప్పుడు కొత్తగా వీఎఫెక్స్ స్టాండర్డ్స్ గురించి కంగారు పడటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఏడేళ్ల కిందట 'రోబో' సినిమాలోనే హాలీవుడ్ సినిమాలకు దీటుగా వీఎఫెక్స్‌ను ఉపయోగించుకుని అబ్బుర పరిచాడు శంకర్. మరి '2.0'ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవడానికి ఆయనకు రెండేళ్ల సమయం సరిపోకపోవడమూ ఆశ్చర్యమే. ఐతే శంకర్ ఇలా కంగారు పడుతుండటానికి.. అప్రమత్తం అవుతుండటానికి రాజమౌళి.. అతను తీసిన 'బాహుబలి' సినిమానే కారణాలుగా భావిస్తున్నారు. 'బాహుబలి: ది బిగినింగ్'తోనే శంకర్‌కు సవాలు విసిరాడు రాజమౌళి. ఇప్పుడు 'ది కంక్లూజన్' విషయంతో మరింత ఉన్నత ప్రమాణాలను నెలకొల్పబోతున్నాడు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం స్పష్టమైపోయింది.

'బాహుబలి'కి పని చేస్తున్న మదన్ కార్కీ 'రోబో' సీక్వెల్‌కు కూడా వర్క్ చేస్తున్నాడు. అతడి ద్వారా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్‌కు సంబంధించి సమాచారం తెలుసుకున్న శంకర్.. ఇప్పుడు తన ఆలోచనలకు తగ్గట్లుగా ఔట్ పుట్ వస్తే '2.0' బాహుబలి-2 ముందు నిలవదని.. క్వాలిటీ మరింత పెంచి.. తన ప్రత్యేకతేంటో చూపించాలని భావించాడని.. అందుకే సినిమా ఆలస్యమైనా పర్వాలేదని.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని.. వాయిదా నిర్ణయం తీసుకున్నాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు