తరుణ్-ఆర్తి గురించి ఇప్పుడెందుకట?

తరుణ్-ఆర్తి గురించి ఇప్పుడెందుకట?

దశాబ్దం కిందట టాలీవుడ్లో ఒక లవ్ స్టోరీ పెద్ద చర్చనీయాంశమైంది. 'నువ్వు లేక నేను లేను' సినిమాలో జంటగా నటించిన సమయంలో ఆ చిత్ర హీరో హీరోయిన్లు తరుణ్-ఆర్తి అగర్వాల్ ప్రేమించుకున్నారని.. ఇద్దరూ పెళ్లికి కూడా రెడీ అయ్యారని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. కొంత కాలం తర్వాత ఆర్తి ఆత్మహత్యా యత్నం చేయడానికి తరుణ్ తో ప్రేమ విఫలం కావడమే కారణమని కూడా ఊహాగానాలు వినిపించాయి.

ఐతే దాని గురించి ఆర్తి వైపు నుంచి కానీ.. తరుణ్ వైపు నుంచి కానీ.. ఎవరూ స్పందించలేదు. ఐతే పుష్కరం కిందటి రూమర్ల గురించి తరుణ్ తల్లి అయిన నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి ఇప్పుడు స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తరుణ్, ఆర్తి అగర్వాల్ ప్రేమికులు కాదని తేల్చి చెప్పింది రోజా రమణి. వాళ్లిద్దరూ నిజంగా ప్రేమించుకుని ఉంటే తాము సంతోషంగా పెళ్లి చేసేవాళ్లమని రోజా రమణి తెలిపింది. వాళ్లిద్దరూ మేజర్లే కాబట్టి తమ ప్రమేయం లేకుండా కూడా వాళ్లు పెళ్లి చేసుకుని ఉండొచ్చని ఆమె అంది. తరుణ్.. ఆర్తి మంచి స్నేహితులు మాత్రమే అని.. వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం ఏమీ లేదని ఆమె చెప్పింది. ఆర్తి అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేయడానికి వ్యక్తిగత కారణాలేవో ఉండి ఉచ్చని.. తన కొడుక్కి దాంతో ఏ సంబంధం లేదని రోజా రమణి స్పష్టం చేసింది.

ఆర్తి నిజంగా తన కొడుకుని ప్రేమించి ఉంటే.. ఆమె వేరే వ్యక్తిని పెళ్లాడేది కాదని ఆమె అంది. ఆర్తిని 'నువ్వు లేక నేను లేను' 100 రోజుల వేడుకలో ఒకసారి మాత్రమే కలిశానని.. తను స్వీట్ గర్ల్ అని ఆమె అభిప్రాయపడింది. ఆర్తి చనిపోయినపుడు తాను చాలా బాధపడ్డానని చెప్పింది. ఐతే రోజా రమణి అప్పటి రూమర్లపై ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏమో. ఇప్పుడు తరుణ్ అనేవాడు లైమ్ లైట్లోనే లేడు. ఆర్తి జీవించే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు