బాహుబలి గుట్టు జర్మనీలో..

బాహుబలి గుట్టు జర్మనీలో..

'బాహుబలి: ది బిగినింగ్' విడుదలకు ముందు పది నిమిషాలకు పైగా నిడివి ఉన్న నాన్-ఎడిటెడ్ కంటెంట్ లీక్ అయిపోవడం అప్పట్లో ఎంత పెద్ద సంచలనం రేపిందో తెలిసిందే. 'బాహుబలి: ది కంక్లూజన్'కు సైతం ఈ లీక్ బెడద తప్పలేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి బృందం 'ది కంక్లూజన్' పోస్ట్ ప్రొడక్షన్ జరిగే సమయంలో మరింత అప్రమత్తమైందట.

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ హంగులద్దే సమయంలోనే ఇంతకుముందు తప్పు జరిగిన నేపథ్యంలో.. ఈ పొరబాటు పునరావృతం కాకుండా 'బాహుబలి' గుట్టును జర్మనీలో దాచారట. అక్కడి నుంచే సర్వర్ ఆపరేట్ చేస్తూ.. అనుమతి ఉన్న బాహుబలి యూనిట్ సభ్యులు లాగిన్ అయితే తప్ప ఆ కంటెంట్‌ను చూసే అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించారట.

'బాహుబలి: ది కంక్లూజన్'కు సంబంధించిన వీఎఫెక్స్ పనులు ప్రపంచవ్యాప్తంగా పలు స్టూడియోల్లో చేశారట. అయినప్పటికీ కంటెంట్ లీక్ కాకుండా ఏం చేశారని వీఎఫెక్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్‌ను అడిగితే.. ''బాహుబలి-2 కోసం ప్రపంచంలో ఒక్క స్టూడియో తప్ప.. మిగతా ప్రముఖ స్టూడియోలన్నీ పని చేశాయి. ఐతే ఎవరు ఈ సినిమా కంటెంట్ చూడాలన్నా.. పని చేయాలన్నా లాగిన్ కావడం తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా జర్మనీలో సర్వర్ ఏర్పాటు చేశాం. ఎవరైనా లాగిన్ అయితే చాలు మాకు అలర్ట్ వస్తుంది.

అందరికీ స్పష్టమైన ఆదేశాలుండటంతో ఎక్కడా పొరబాటు జరక్కుండా చూసుకున్నాం. కాబట్టి లీకుల బెడద తప్పింది. గత అనుభవాల దృష్ట్యా రాజమౌళి సహా అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు" అని చెప్పాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే రహస్యం తనకు కూడా తెలియదని.. ఆ సన్నివేశంలో వీఎఫెక్స్ వర్క్ ఏమీ లేకపోవడంతో తనకు ఆ సన్నివేశం చూసే అవకాశం రాలేదని కమల్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు