అసలు కారణమేంటో ప్రభాస్ చెప్పాడు

అసలు కారణమేంటో ప్రభాస్ చెప్పాడు

బాహుబలి కోసం ప్రభాస్ ముందు కేటాయించింది రెండు సంవత్సరాలే. 2015లో సినిమా పూర్తి చేసేసి.. ఆ తర్వాత ‘రన్ రాజా రన్’ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలుపెట్టాలనుకున్నాడు.

కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్నట్లుగా బాహుబలి అనుకోకుండా రెండు భాగాలుగా మారింది. 2016 ఆఖరుకు గానీ ఈ సినిమా పూర్తి కాలేదు. రెండు భాగాలకు మధ్యలో ఎనిమిది నెలలకు పైగా గ్యాప్ వచ్చినా కూడా ప్రభాస్ వేరే సినిమా చేసుకోలేదు. స్వయంగా రాజమౌళి వేరే సినిమా చేసుకోమన్నా అతను అంగీకరించలేదు. మరీ ప్రభాస్‌లో ఇంత కమిట్మెంట్ ఏంటో అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ విషయమై ‘బాహుబలి-2’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

‘‘నేను, రాజమౌళి ‘బాహుబలి’తో పాటు ఇంకేదైనా సినిమా చేసుకుని ఉంటే.. రెండు భాగాలు పూర్తవడానికి ఎనిమిదేళ్లు పట్టేది. రాజమౌళిని నమ్మి అతడితో ప్రయాణించాలని నిర్ణయించుకున్నా. వేరే డీవియేషన్లు ఏమీ ఉండకూడదనుకున్నా. ఒకవేళ నేను వేరేదైనా సినిమా చూస్తే నా మూడ్ మారుతుంది. ఆ సినిమాకు సంబంధించి ఏదైనా పెండింగ్ పడితే కష్టం.
‘రాజమౌళీ.. జస్ట్ క్లైమాక్స్ ఒక్కటుంది.. పూర్తి చేసి వచ్చేస్తా’ లాంటి ఎక్స్‌క్యూజ్‌లు అడగొద్దని అనుకున్నా. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు అందుబాటులో ఉండాలనుకున్నా. అందుకే వేరే సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా. దాని వల్ల నాకొచ్చిన నష్టమేమీ లేదు. ఈ నాలుగేళ్లలో మామూలు సినిమాలైతే ఎనిమిది చేసి ఉండొచ్చు. కానీ 16 సినిమాలు చేసినా ‘బాహుబలి’కి వచ్చినంత పేరు రాదు’’ అని ప్రభాస్ స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు