క్రియేటివిటీ నిల్.. క్రేజ్ ఫుల్

నృత్య దర్శకుడిగా, నటుడిగా 90వ దశకంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభుదేవా దర్శకుడిగా మారతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రభుదేవా. కానీ ఆ సినిమా అంత బాగా రావడంలో రచయితలు పరుచూరి సోదరులు, నిర్మాత ఎం.ఎస్.రాజుల పాత్ర కీలకం. అప్పుడు వాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

ఈ సినిమాను పక్కన పెడితే ప్రభుదేవా సొంత కథతో సినిమా తీసి హిట్టు కొట్టిన దాఖలాలే లేవు. దర్శకుడిగా అతడి రెండో సినిమా ‘పౌర్ణమి’ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘పోకిరి’ సినిమాను తమిళంలో, హిందీలో రీమేక్ చేసి భారీ విజయాలందుకున్నాడు ప్రభుదేవా. అలాగే ‘విక్రమార్కుడు’ను హిందీలో ‘రౌడీ రాథోడ్’గా రీమేక్ చేసి మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. తర్వాత ప్రభుదేవా తీసిన సినిమాల్లోనూ అతడి సొంత టాలెంట్ పెద్దగా ఏమీ లేదు.

ఇప్పుడు ప్రభుదేవా నుంచి ‘రాధే’ సినిమా రాబోతోంది. ఇంతకుముందు ప్రభుదేవాతో ‘వాంటెడ్’తో పాటు ‘దబంగ్-3’లో నటించిన సల్మాన్.. అతడితో మూడోసారి జట్టు కట్టాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కొత్తగా ఏమీ లేదు. ‘పోకిరి’, ‘ఏక్ నిరంజన్’ లాంటి తెలుగు సినిమాల స్ఫూర్తితో సినిమా తీసినట్లే ఉంది. పాత సినిమాల పంచ్ డైలాగులు, ఎలివేషన్ సీన్లతోనే నింపేశాడు ప్రభుదేవా. కొత్తగా ఏమీ కనిపించలేదు.

అయినా సరే.. సల్మాన్ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు సినిమాను ఆడించేస్తారు. ప్రభుదేవా ఖాతాలో మరో విజయం జమ కాబోతున్నట్లే కనిపిస్తోంది. క్రియేటివిటీ ఏమీ లేకపోయినా, సొంతంగా స్క్రిప్టు రాసుకోకపోయినా.. దర్శకుడిగా ప్రభుదేవాకు మంచి క్రేజ్ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అతడికి మాస్ పల్స్ తెలుసు. వాళ్లకు నచ్చేలా మసాలా కలపడంలో, సినిమాను ప్రెజెంట్ చేసే టాలెంట్ ఉంది. దాంతోనే అగ్ర దర్శకుల్లో ఒకడిగా చలామణి అయిపోతూ టాప్ హీరోలతో సినిమాలు చేసుకుపోతున్నాడు.