రాజమౌళి బ్లాక్ బస్టర్.. రమకు నచ్చలేదట

రాజమౌళి బ్లాక్ బస్టర్.. రమకు నచ్చలేదట

ఎస్.ఎస్.రాజమౌళి అంటే సూపర్ సక్సెస్ రాజమౌళి అని కూడా పిలుచుకుంటారు అభిమానులు. ఇప్పటిదాకా అపజయం అన్నదే లేదు రాజమౌళి కెరీర్లో. ఒక సినిమా తర్వాత ఇంకోటి సూపర్ హిట్ ఇస్తూ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు జక్కన్న. ఐతే రాజమౌళి తీసిన సినిమాలన్నీ హిట్టే అయినప్పటికీ వాటన్నింటినీ అందరూ ఇష్టపడాలని ఏమీ లేదు.

అందులో కొందరికి నచ్చని సినిమాలు కూడా ఉన్నాయి. స్వయంగా రాజమౌళి సతీమణి రమనే ఆయన సినిమాల్లో ఒకటంటే తనకు ఇష్టం లేదంటోంది. ఆ సినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’.

అవును.. యమదొంగ సినిమా అంటే రమ రాజమౌళికి ఇష్టం లేదట. ఎందుకు అన్నది చెప్పలేదు కానీ.. సినిమా అయితే తనకు నచ్చలేదని ఆమె తెలిపింది. ఈ సినిమా హిట్టయిందంటే అది రాజమౌళి ప్రతిభగా తాను భావించట్లేదని.. ఎన్టీఆర్ వల్లే ఆ సినిమా ఆడిందని అభిప్రాయపడింది రమ.

ఎన్టీఆర్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషించిన ‘యమదొంగ’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది.  ‘శంకర్ దాదా జిందాబాద్’కు పోటీగా వచ్చిన ‘యమదొంగ’.. చిరు సినిమాను దెబ్బ కొట్టి మరీ తిరుగులేని విజయం సాధించింది. అలాంటి సినిమా తనకు నచ్చలేదని రమ చెప్పడం చిత్రమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు