మోడికి ఉక్కు రివర్స్ షాక్ ?

తొందరలోనే నరేంద్రమోడికి విశాఖ ఉక్కు షాకివ్వబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనుకోవాలి. వచ్చే నెల 7వ తేదీన కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో బంద్ చేయాలని డిసైడ్ అయ్యింది. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్యాక్టరీని ప్రైవేటీకరించ వద్దని ఉద్యోగులు, కార్మికులు ఎంతగా మొత్తుకుంటున్నా కేంద్రం లెక్క చేయటంలేదు.

విజ్ఞప్తులను లెక్కచేయకపోగా ప్రైవేటీకరణ అంశంపై పదే పదే నరేంద్రమోడి మాట్లాడుతున్నారు. దాంతో మోడి వైఖరికి నిరసనగా చాలారోజులుగా వైజాగ్ లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేకరూపాల్లో ఆందోళనలు జరిగాయి. అయితే తమ ఆందోళనలకు కొనసాగింపుగానా అన్నట్లు వచ్చేనెల 7వ తేదీన ఫ్యాక్టరీలో బంద్ పాటించాలని తాజాగా డిసైడ్ అయ్యింది. ఫ్యాక్టరీ బంద్ అంటే ఎన్ని సమస్యలు వస్తాయో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.

ఫ్యాక్టరీలో కేవలం ఉక్కు ఉత్పత్తిమాత్రమే కాకుండా మెడికల్ ఆక్సిజన్ కూడా ఉత్పత్తవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బకు ఎలా వణికిపోతోందో అందరు చూస్తున్నదే. రోజుకు 3 లక్షల కేసులు, వేలాది మరణాలు వెలుగుచూస్తున్నాయి. మరణాల్లో రోగులకు ఆక్సిజన్ సకాలంలో అందకపోవటం కూడా ముఖ్య కారణమే. దేశంలో అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కావటంలేదు.

దేశవ్యాప్తంగా ఇపుడందుతున్న మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తవుతున్నదే మేజర్ పాత్ర. దేశం మొత్తంమీద మెడికల్ ఆక్సిజన్ రోజుకు 500 టన్నులు అవసరం అవుతుంటే విశాఖ ఉక్కులో సుమారు 150 టన్నులు ఉత్పత్తవుతున్నది. ఇప్పటికి 8200 టన్నుల సరఫరా అయ్యింది. ఫ్యాక్టరీలోని ఐదు కేంద్రాల ఉత్పత్తి సామర్ద్య సుమారు 3 వేల టన్నులు. అయితే ఇందులో చాలావరకు ఫ్యాక్టరీ అవసరాలకే సరిపోతుంది. కానీ ప్రస్తుత కరోనా వైరస్ పరిస్ధితుల కారణంగా 150 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు అందిస్తోంది.

ఇలాంటి పరిస్ధితుల్లో స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై మోడి వైఖరికి నిరసనగా మే 7వ తేదీన ఫ్యాక్టరి బంద్ చేయాలని ఉద్యోగులు, కార్మికులు డిసైడ్ అయ్యారు. ఇపుడున్న ఎమర్జెన్సీ పరిస్దితుల్లో గంటపాటు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేస్తేనే చాలా సమస్యలు వస్తాయి. అలాంటిది ఒకరోజు ఫ్యాక్టరీ బంద్ అయితే దేశం ఏమైపోతుందో ఊహించటానికి కూడా భయంగానే ఉంది. కానీ ఇలా చేస్తేనే మోడికి తమ బాధేమిటో అర్ధమవుతుందని ఉద్యోగులు, కార్మికులంటున్నారు. మరి వీళ్ళ నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.